చెమ్మ : వారాల ఆనంద్
కొన్నిజీవితాలు ఒక ఊరికథగా మొదలై దేశం చరిత్రగా ముగుస్తాయి. పి. వి.నరసింహారావు సాధారణ రాజకీయనాయకుడిగా మాత్రమేకాక ఆయనలో దాగిఉన్న రచయిత, అనువాదకుడు, భాషావేత్త ఇవన్నీ కలిసి విభిన్న సాహిత్యవ్యక్తిత్వాన్ని నిర్మించాయి. ఆయన రచనల్ని చదివితే రాసిన దానికంటే రాయక స్ఫురింపజేసిన విషయాలే ఎక్కువేమో అనిపిస్తుంది. రాజకీయాల్లోకి రాకుండా సాహిత్య సృజనకే పూర్తికాలం వెచ్చించి వుంటే ప్రపంచ సాహితీలోకంలో వెలిగిపోయేవారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన పివికి చిన్ననాడే సాహితీస్పర్శ తగిలింది. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే గార్లపాటి రాఘవరెడ్డి శిష్యరికంతో పివి కి పద్య కవిత్వంపైన ఇష్టం కలిగింది. ఆ తర్వాత పాములపర్తి సదాశివరావు, కాళోజీ, బూర్గుల, దేవులపల్లి రామానుజరావు తదితరుల సాన్నిహిత్యంలో ఆయన సాహిత్యాభిరుచి పెరుగుతూ వచ్చింది. చిన్ననాటినుండే జానపదాల మీద జానపద కళారూపాల మీద అత్యంత మక్కువ పెంచుకున్నారు. ఆయన రచయితే కాదు మంచి గాయకుడు, ఫోటోగ్రఫీ అంటే కూడా ఆయనకు గొప్పసరదా. తెలంగాణా సాయుధ పోరాటాల కాలంలో రామక్క అనే పోరాట యోధురాలిని ప్రధానపాత్రగా పివి రాసిన ‘గొల్ల రామవ్వ’ గొప్పకథ. ‘విజయ’కలం పేరుతో ఈ కథను 1949 ఆగస్టు 5న కాకతీయ పత్రికలో ప్రచురించారు.
‘…బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైంది’ అన్న ఎత్తుగడతో కథ మొదలవుతుంది. కథాకాలం ఆనాటి తెలంగాణ రాజకీయ, సామాజిక ఛిద్రవ్యవస్థను సూచిస్తూ రెండు నిమిషాల్లో చెలరేగిన ఆ అలజడిని రచయిత ‘ఏదో మహా భయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా ఊరివారందరూ నిద్రనుండి త్రుళ్లి పడిలేచినట్లు, అదొక విచిత్ర ప్రళయం, మృత్యు తాండవం’ అన్నారు. డెబ్బయి ఏళ్లపైబడిన ముదుసలి గొల్ల రామవ్వ తనగుడిసెలో చీకటిలో కూర్చొని ఉంది. ఆమెతోపాటు మనుమరాలు పదిహేనేండ్ల బాలిక మల్లి. హఠాత్తుగా ఆ గుడిసె కిటికీనుండి ఒకవ్యక్తి లోపలికి చొరబడ్డాడు. మల్లి భయకంపితమైంది. మల్లికి మానభంగం తప్పదేమోనని అవ్వ కన్నీరు మున్నీరై నిలిచిపోయింది. ఇంతలో ఆ వ్యక్తి ముసలవ్వ చెవిలో ‘చప్పుడు చేయకు. నేను దొంగను కాను రజాకార్ను కాను పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను. లొల్లి మాత్రం చేయకండి’ గుసగుసలాడాడు.
ప్రాణ, మానభీతితో ఆ వ్యక్తి కాళ్లు పట్టుకున్న రామవ్వ మెలమెల్లగా లేస్తూ అతని శరీరాన్ని తడిమింది. అంతే. వాస్తవస్థితిని అర్థం చేసుకుంది. గాయాలతోనూ, రక్తంతోనూ కూడిన శరీరంతో, నిస్సహాయ స్థితిలో వున్న ఆ యువకుడి ప్రాణ రక్షణ తన కర్తవ్యంగా భావించింది. ఆమెలోని మాతృప్రేమ పెల్లుబికింది. మృత్యువుతో పోరాడుతున్న ఆ యువకునికి శుశ్రూషచేసి, సేదతీర్చి, సల్లతాగించి బ్రతికించింది. ప్రేమతో ఆ యువకుడి దేహాన్ని నిమురుతున్న అవ్వకు రివాల్వర్ తగిలింది ‘ఎందుక్కొడుకో తూపాకీ! మమ్మల్ని గిట్ల చంపుదామనుకొన్నావా యేంది?’ అన్నప్రశ్నకు ‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్లను చంపేందుకది అంటూ ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చిచంపిన పోలీసుల్ని’. అవ్వమొహంలో ఉత్సాహం ఆమె పెదవులు కదిల్చింది. ఇద్దరా? కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా? సగంపనే చేసినావు’ ఆమె అన్న ఆ మాటలు యువకునిలో ఉద్వేగం కలిగించాయి. రివాల్వర్ కొరకు చేయి చాస్తూ ‘తక్కినవాళ్లను కూడా చూచుకొస్తాలే అవ్వా’ అని పలికిన ఆ యువకుడిని సున్నితంగా, ప్రేమతో నిద్దరపట్టితే బతుకుతావని మందలించింది, ఆజ్ఞాపించింది.
తాను, మల్లి కాపలాకాస్తుంటే ఆ యువకుడు సుఖనిద్ర పోయాడు. పాలు పిండేవేళ పోలీసుల దమనకాండ. ఆ రాక్షసులను ఎదిరించేందుకు సిద్ధమైన ఆ వీర యువకుడిని చేయిపట్టుకొని వెనక్కు లాగింది. యువకుడిని ముందుకు పోనివ్వలేదు. ఇల్లు సోదాకు భయపడలేదు. అపాయానికి వెరవలేదు. మనవరాలిని ఆ యువకుడి పక్కన పడుకోబెట్టింది. పోలీసులను అమాయక మాటలతో చేతలతో నమ్మించింది. జమాదారుని బయటకుపంపించింది. యువకుడి ప్రాణాలను రక్షించింది‘, ‘అవ్వా! నీవు సామాన్యురాలివి గావు. సాక్షాత్ భరతమాతవే!’ అన్న యువకుడి మాటలకు పొంగి పోకుండా నిగర్వంతో ‘తొడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావు? నా పేరు గొల్ల రామి! గంతే. ఇగ నువ్వెల్లు.’ అని అతడిని ఆజ్ఞాపించింది. క్లుప్తంగా ఇది రామవ్వకథ. గొల్ల రామమ్మ పాత్రను చిత్రీకరించిన శైలి, ఆవిష్కరించిన రూపం అద్భుతం. గొల్ల రామవ్వ కథ పి.వి. రచనా పాటవానికి మచ్చుతునక.
విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘’వేయిపడగలు’’ నవలను పీవీ ‘సహస్ర ఫణ్’ పేర హిందీలోకి అనువాదం చేసారు. దానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు వచ్చింది. ‘నేను ప్రగతి వాదిగానే వేయిపడగలు అత్యత్తమ గ్రంధమని అర్థం చేసుకున్నాను’ అన్నారు పీవీ. మొదటినుంచీ సాహిత్యవేత్తలతో సన్నిహిత సంబంధాల్ని కలిగి వున్న పివి 1996 లో ప్రధాని పదవినుండి వైదొలగిన తర్వాత ఆత్మ చారిత్రాత్మక కథను కథాత్మక రచనగా ‘ది ఇన్ సైడర్’ రాసారు. భారత రాజకీయాల లోపలి ఆత్మని అవిష్కరించింది. వాస్తవలకు తన అనుభావాలను రంగరించి రాసిన ఈ నవలలో కొంత కథ కొంత వూహ కలగలసిపోయి సాగుతుంది. భారతదేశ రాజకీయస్థితిని హృద్యంగా చిత్రించింది నవల. దీంట్లో మనకు కేవలం ఢిల్లీ కనిపించదు.
మనిషి అంతర్గత ప్రపంచం కనిపిస్తుంది. పి.వి. దాన్ని నాయకుడిగా రాయలేదు, జీవితాన్ని చూసిన వ్యక్తిగా రాశాడు. అధికారపు మెట్లు ఎక్కుతున్నప్పుడు మనిషి తననుతాను ఎక్కడ కోల్పోతాడో అది ఈ నవల మనకు మంద్రంగా చెబుతుంది. సులభశైలిలో సున్నిత హాస్యాన్ని జోడించి సాగే ఈ నవల బాగా చదివిస్తుంది. ఇందులో ప్రధానపాత్ర ఆనంద్ అనుభవాల్లో అధికశాతం పివి అనుభవాల్లోచి తీసుకున్నవే. భారత రాజకీయాల భవిష్యత్తుని అత్యంత ముఖ్యమయిన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకున్న నిర్ణాయక వర్గంలో సభ్యుడిగా వున్న పివి ఆయాకాలాల్లోని స్థితినీ లోతుపాతుల్నీ ఇందులో చిత్రించారు పివి. ఆ నవలను కె.భాస్కరం ‘లోపలి మనిషి’ పేర తెలుగులోకి అనువదించారు. ఇన్ సైడర్ రెండవ భాగాన్ని కూడా రాయడానికి పివి పూనుకున్నారు కాని కొంత భాగం రాసాక అనారోగ్యం ముంచుకొచ్చి లోకాన్ని విడిచి వెళ్లి పోయారు. తెలుగు సాహితీ ప్రపంచంతో పాటు భారతీయ సాహిత్య ప్రపంచంలో తనకు ఒక స్థానాన్ని నిలుపుకొని మరోక శూన్యాన్ని మిగిల్చి వెళ్లి పోయారు 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసారు.
అదే సముద్రం