రాళ్ళబండి శశిశ్రీ
1
పగలు పబ్బాన్ని గడుపుకొని
రాత్రిళ్ళు దుఃఖాన్ని మిగిల్చే
మనుషులు చుట్టూ ఉన్నా
అలై పొంగుతూనే ఉంటుంది సముద్రం!
2
అలంకరించుకున్న అబద్దాలతో
లోకం అందంగా వెలిగిపోతూంటుంది
నగ్నత్వాన్ని చూడలేక
మనుషులు అంధత్వాన్ని ప్రేమిస్తూంటారు
3
చీకట్లో దాక్కున్న రాత్రుళ్ళు కాదు
వెలుగు పగటి వేషం మోసం
ద్వేష హృదయానిదో
కమ్మని భాష!
కలుషిత పెదవులపై
తియ్యని నవ్వు!
అన్ని ఆర్భాటాల్ని
తృణీకరిస్తూ రాత్రి!
4
రాత్రుళ్ళ వైశాల్యంలోనే
లోపలి ప్రపంచం వ్యాపించేది!
5
ఇప్పుడిక
కలల్ని ఆవిరిచేయటం
దుఃఖాల్ని ప్రేమించడం
సంతోష దుఃఖాల మధ్య
అంతరాలు తగ్గించే ప్రయత్నంలో
పాత కెరటాలుగా తెగి
కొత్త కెరటాలుగా అదే సముద్రం!




మిలియన్ ఫాలోవర్స్