పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను అందిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే ప్రధానంగా మాంసాహార ఆహార సంస్కృతి ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఈ నిర్ణయంపై పోషకాహార నిపుణులు, వైద్యులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారి ప్రధాన వాదన  గుడ్డు అనేది కేవలం ప్రోటీన్‌కు మాత్రమే పరిమితమైన ఆహారం కాదు. పిల్లల మెదడు అభివృద్ధికి అవసరమైన కొలిన్, విటమిన్-బి12, విటమిన్-డి, ఐరన్, సెలీనియం వంటి అనేక కీలక పోషకాలు ఒకే ఆహారంలో లభించే అరుదైన వనరు. సోయాబీన్, పప్పుధాన్యాలు మంచి ప్రోటీన్‌ను అందించినప్పటికీ, గుడ్డులో లభించే పూర్తి అమినో ఆమ్లాల సమతుల్యత, శరీరం సులభంగా గ్రహించే జీవలభ్యత (Bioavailability) వాటిలో ఉండదని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కేవలం ఆకలి తీర్చే కార్యక్రమం కాదు. అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మానవ వనరులపై పెట్టుబడి. అలాంటి పథకంలో ఏ ఆహారాన్ని చేర్చాలి? ఏది తొలగించాలి? అనే నిర్ణయాలు మత విశ్వాసాలు, రాజకీయ అభిరుచులు లేదా సిద్ధాంతాల ఆధారంగా కాకుండా శాస్త్రీయ ఆధారాలు, పిల్లల ఆరోగ్య అవసరాల ఆధారంగానే ఉండాలి. ఈ నేపథ్యంలో పాఠశాల భోజనంలో గుడ్డు స్థానంపై మళ్లీ చర్చ మొదలవడం ఆందోళన కలిగించే అంశమే.

భారతదేశంలో ఇప్పటికీ లక్షలాది మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రక్తహీనత, ఎదుగుదల మందగించడం, తక్కువ బరువు, చదువుపై ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ప్రభుత్వాల ముందున్న ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తక్కువ ఖర్చుతో అత్యధిక పోషక విలువలు అందించే ఆహారం ఏదంటే, పోషకాహార నిపుణులు సందేహం లేకుండా చెప్పే సమాధానం—గుడ్డు.

ఒక ఉడికించిన గుడ్డు సుమారు 6.5 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. అంతేకాదు, శరీరానికి అత్యవసరమైన తొమ్మిది అమినో ఆమ్లాలన్నీ సమతుల్యంగా ఉండటం గుడ్డు ప్రత్యేకత. దీనినే “కంప్లీట్ ప్రోటీన్” అంటారు. విటమిన్-బి12, విటమిన్-డి, ఐరన్, సెలీనియం, కొలిన్ వంటి కీలక పోషకాలు కూడా గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కొలిన్ పిల్లల మెదడు ఎదుగుదలకు, జ్ఞాపకశక్తి పెంపుకు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో అవసరం.

గుడ్డుకు బదులుగా పనీర్, సోయాబీన్, పప్పుధాన్యాలు ఇవ్వొచ్చని కొందరు వాదిస్తున్నారు. అవి కూడా పోషకాహారమే. కానీ గుడ్డులో ఉన్న అన్ని పోషకాలను ఒకే ఆహార పదార్థం ద్వారా సమానంగా అందించడం అంత సులభం కాదు. అంతేకాదు, సమానమైన ప్రోటీన్‌ను పనీర్ ద్వారా అందించాలంటే ప్రభుత్వంపై ఖర్చు అనేక రెట్లు పెరుగుతుంది. సుమారు ₹10 ఖర్చుతో ఒక గుడ్డు లభిస్తే, సమానమైన పోషక విలువల కోసం పనీర్‌పై దాదాపు ఐదు రెట్లు ఎక్కువ వ్యయం చేయాల్సి వొస్తుంది. ప్రభుత్వ పథకాలలో వ్యయ సరళి కూడా ఒక ముఖ్యమైన అంశమే.

గుడ్డు మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, దానిలోని ప్రోటీన్‌ను శరీరం సులభంగా జీర్ణించుకొని వినియోగించుకుంటుంది. దీనినే జీవ లభ్యత (బయో అవైలబిలిటీ) అంటారు. సోయా, పప్పుధాన్యాల్లో ప్రోటీన్ ఉన్నప్పటికీ, అవి గుడ్డు స్థాయిలో శరీరానికి అందుబాటులోకి రావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పిల్లల పోషకాహార కార్యక్రమాల్లో గుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది.

ఆహారపు అలవాట్లు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. శాకాహారం మాత్రమే తీసుకునే పిల్లలకు వారి అభిరుచికి అనుగుణంగా సోయా, పప్పుధాన్యాలు, పాలు, పనీర్ వంటి ప్రత్యామ్నాయాలు తప్పకుండా అందించాలి. అయితే గుడ్డు తినే పిల్లల నుంచి ఆ అవకాశాన్ని తీసివేయడం సరైన ప్రజారోగ్య విధానం కాదు. ఎంపిక ఉండాలి కానీ పోషకాహారం తగ్గకూడదు.

దురదృష్టవశాత్తు మన దేశంలో అనేకసార్లు పిల్లల పోషకాహారం కూడా రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతోంది. కానీ పిల్లల శరీరానికి, మెదడుకు రాజకీయాలు అర్థం కావు. వాటికి అవసరమయ్యేది సరైన పోషకాలు మాత్రమే. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం ముందుగా చిన్నారుల ఆరోగ్యంపైనే పడుతుంది. అందుకే ప్రజారోగ్య విధానాలు శాస్త్రీయ పరిశోధనలు, వైద్య నిపుణుల సిఫార్సులు, పోషకాహార ప్రమాణాల ఆధారంగానే ఉండాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు ఇంట్లో ప్రతిరోజూ సమతుల్యమైన ఆహారం దొరకకపోవొచ్చు. అలాంటి వారికి మధ్యాహ్న భోజనమే అత్యంత విశ్వసనీయమైన పోషకాహార వనరు. ఆ భోజనంలో గుడ్డు ఉంటే అది కేవలం ఒక ఆహార పదార్థం కాదు—ఆరోగ్యవంతమైన బాల్యం, మెరుగైన విద్య, బలమైన భవిష్యత్తుకు ఇచ్చే హామీ.

పిల్లల భవిష్యత్తును నిర్ణయించే అంశాల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదు. శాస్త్రీయంగా నిరూపితమైన, తక్కువ ఖర్చుతో అత్యధిక పోషక విలువలను అందించే గుడ్డును పాఠశాలల మధ్యాహ్న భోజనంలో కొనసాగించడం ప్రభుత్వాల బాధ్యత. పిల్లల ఆరోగ్యం ముందు సిద్ధాంతాలు కాదు; పౌష్టికాహారమే ప్రాధాన్యం కావాలి. దేశ భవిష్యత్తును నిర్మించేది రాజకీయ వాదనలు కాదు, ఆరోగ్యవంతమైన విద్యార్థులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *