శ్రమ ఎప్పుడు అజరామరంగ జీవిస్తుంది. శ్రమను ప్రేమించిన వాళ్ళు చరిత్రను తనవెంట తిప్పుకుంటూ ప్రపంచం ముందర తరాలవారధిగా నిలబడతారు. ఏండ్లనాటి జీవన స్థితిగతులు, సామాజిక వృత్తినైపుణ్యాలు అప్పుడప్పుడు అస్తిత్వశోధనలో భాగంగా బయటపడతాయి. అందులో భాగంగానే యువకవి మిత్రుడు, ఉప్పరి తిరుమలేష్ తన జాతి పుట్టుక పూర్వోత్తరాలు, జీవనవిధానంలో శ్రమైకజీవన సౌందర్యాన్ని ‘మెట్న’ దీర్ఘకావ్యంలో మనముందుంచాడు. ఇంతకుముందే చిరుమొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, నీ ధ్యాసలోనే, తొలకరి జల్లు (వచన కవిత్వం) బతుకు నానీలు, నాగలి (దీర్ఘకవిత్వం) వంటి సాహిత్యాన్ని అందించాడు. ఇపుడు తన జాతి అస్తిత్వాన్ని తెలియజేసేటటువంటి ‘మెట్న’ దీర్ఘకావ్యానికి అంకురార్పణ చేసిండు.
తిరుమలేష్ ఉప్పరుల జీవితాన్ని, వారి నేపథ్యాన్ని మెట్న దీర్ఘకావ్యంలో నాలుగుభాగాలుగా రాశాడు. ఏ భాగానికి ఆ భాగం ప్రత్యేకతను చూపించాడు. ఇప్పటివరకు నాకు తెలిసి తెలంగాణలో ఉప్పరుల జీవితం మీద వొచ్చిన తొలి దీర్ఘకావ్యం ఇదే కావచ్చు. మొదటి భాగంలో ఉప్పరుల ఔన్నత్యాన్ని శ్రమగీసిన చిత్తరువులను మన ముందుంచాడు. ఊరికి ముగ్గుపోసే తొలి పూజారులు ఉప్పరులంటడు. ఏ ఇల్లు కట్టినా, ప్రాజెక్టులు కట్టినా, దేవాలయ నిర్మాణం చేసిన తన తాత ముత్తాతల అడుగుజాడలు లేనిదే ఉపయోగంలోకి రాలేదంటాడు. ఉప్పరుల నిత్యజీవితంతో ముడిపడి ఉన్న పనిముట్లను మల్లొకసారి అందరికీ పరిచయం చేసిండు. ఈ యాంత్రిక జీవితంలో నూతన పనిముట్లు వొచ్చి ఆనాటి కాలం పనిముట్లన్నీ కనుమరుగైపోతున్న కాలంలో, మళ్ళీ వారి పనిముట్ల పనితనాన్ని తెలియచెప్పిండు. ఎన్నో పనిముట్ల పదబంధాలను వాడిండు. వొల్లెం గుండుదారం, మెట్న, ఆయం, రోడ్డచెక్క, కర్నే, మొల్దారం, సుత్తె, జల్లెడ ఇంకా చాలా పనిముట్లను తెలిపిండు. గడ్డపారనే ఉప్పరుల కలంచేసి చరిత్రను తవ్వి మన ముందుంచిండు. ఇంటి భూమిపూజ నుండి నిర్మాణం పూర్తయ్యేవరకు ఉప్పరులు పడే కష్టాన్ని తెలిపాడు. ఇందులో రెండోభాగంలో ఉప్పరుల పూర్వచరిత్రను తెలిపాడు. సూర్యవంశానికి చెందిన తాము ధర్మం ధైర్యం కలిగిన వారిగా భగీరథుని ఆదిదేవునిగా ఆరాధించే శ్రమజీవులుగా తెలిపాడు.
మూడోభాగంలో తమ అస్తిత్వ ఆనవాలను కాలం పేజీమీద చిరస్మరణీయంగా ముద్దెరేశాడు. ప్రపంచీకరణలో తమ కులవృత్తి ధ్వంసమైన విధానాన్ని మట్టిగోడలకు మౌనంగా చెప్పుకున్నాడు. చారిత్రాత్మక కట్టడాలను కట్టిన ఉప్పరుల చరిత్రను, తాపీ గొప్పతనాన్ని పళ్లెంనిండా నింపి ప్రపంచ సాహిత్యం మొఖంమీద ఉప్పర్ల జీవితాన్ని చిత్రించాడు. తాజ్ మహల్, గోల్కొండ, అజంతా, ఎల్లోరా ఏది కట్టిన మా జాతి చెమట చుక్కల పుణ్యమే అంటాడు. అసెంబ్లీకి, పార్లమెంటుకు ముగ్గు పోసింది మేమైనా మా గోడు ఆ గోడలు వినే పరిస్థితులు ఇప్పుడు లేదనేది జగమెరిగిన సత్యం అంటూ ప్రశ్నలకు పదును పెడుతుండు.
నాలుగవభాగం అంతా నాయినను మనసునిండా తలచుకున్నడు. నాయినమీద అవ్యాజమైన ప్రేమను, నాయిన కష్టాన్ని కండ్లకు కట్టినట్లు చూపించాడు. ఇప్పుడు ఏ మేస్త్రి ఈ పుస్తకం చదివిన నా జీవితం గురించి రాసిండు అన్నట్లు ఉంటది. వారి బాధ, వేదన, కష్టం అంతా కూడా అక్కడ కనిపిస్తుంది. మెట్న దీర్ఘకావ్యానికి తన నాయినే హీరో. నాయిన లేకపోతే ఉప్పర్ల జీవితాన్ని ఆవిష్కరించేవాడు కాదేమో. నాయిన చెమట చిందించిన తనువును చూసినందుకే కలమెత్తి ప్రపంచం ముందు నిలబెట్టిండు ఉప్పరి తిరుమలేష్. అక్షర జ్ఞానం లేని నాయినను న్యాయవాదిగా, ఇంజనీరుగా నిరూపించి రాసిన అక్షరాలు ఇందులో ఉన్నాయి. నాయిన పనితనానికీ అందరూ పరవశించి పోవాల్సిందే అంటాడు. నాయిన ఏ ఇంటి పంచాదికొయినా చేతిలో మెట్న పట్టిండంటే అన్నిభాగాలు సమానంగా ఐపోతయంటడు. ఏడుకొండల వాడికే నిలువనీడ కట్టిన వెంకట్ రాములు మా నాయిన అంటూ నాన్న గొప్పతనాన్ని చెప్పాడు.
“మత్తడి కట్టిన మట్టి మనుషులం/ చెరువుకింద ఎకరాభూమి లేని/ నిరుపేదలం ఉప్పరులం/ రచ్చకట్ట నిర్మాతలం/ సామాన్యులం మేము ఉప్పరులం/ జాతీయ రహదారులు/ మా జాతి శ్రమ ప్రతిరూపాలు/ రోడ్డుపక్కనే గోడెల్లవోసే/ అభాగ్యులం మేము ఉప్పరులం/ ఊరికి ముగ్గుపోసే రథసారథులం/ నులకమంచాన్నే/ నెమలి సింహసనంగా/ గుండుదారాన్నే/ గుండెకు అదెరువుగా/ వాస్తుశాస్త్రాన్ని ఆపోసన/ పట్టిన పెద్దమేస్త్రీ/ అక్షరజ్ఞానం లేని/ నవనూతన ఇంజనీర్ మా నాయన/ విష్ణుమూర్తి చేతిలోని శంకుచక్రాలు/ మా నాయన చేతిలోని తాపీపల్లాలే/ ఏడుకొండలవాడికే/ నిలువనీడ కట్టిన/ వెంకట రాములు మా నాయన.” యుగయుగాల చరిత్రలో సగరుడు కట్టిన గుడులు చరిత్ర కెక్కాయి. శాసనాల ద్వారా పౌరాణికాలకు ఎక్కాయి కానీ గుడిని గట్టిన సగరుడికి చరిత్రలో స్థానం దక్కలేదు.
ఊరుకు ముగ్గుపోశారు. ఇల్లు గుడికట్టారు. చెరువుకు కట్టగట్టారు. గ్రామదేవతలకు కోట బురుజులు గట్టారు రోడ్లువేశారు. నగరాలను నిర్మాణం చేశారు. అంతస్తులు మేడలు ఎన్నెన్నో అపురూపాలన్నీ వాళ్లు కట్టినవే. కట్టడం ఏదైనా తాపీమేస్త్రి లేకుండా ఏ కట్టడం నిర్మాణం కాలే. ప్రపంచ గుర్తింపు పొందీన సరలా సాగర్ నిర్మాణాన్ని కవి చెప్పినతీరులో ‘ప్రపంచ వింత మనచెంత/ సరళాసాగరు ప్రపంచంలో రెండవ ఘనత/ సాగర్ సగరుల మణికట్టు మణిహారమే’ అంటాడు
మెట్న దీర్ఘకావ్యం అవసరమైన సందర్భంలోనే తీసుకొస్తున్నాడు ఉప్పరి తిరుమలేష్. బీసీ అస్తిత్వవాద ఉద్యమాలు ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో నల్లేరు నడకల విస్తరిస్తుంది. మెట్నలో ఉప్పరుల జీవితం గురించే రాసిన అందులో అన్ని వృత్తికులాల జీవితాల వేదనను వేరు చేసి చూడలేము. అందుకే కవి మెట్న దీర్ఘకావ్యాన్ని ప్రశ్నలతోనే ముగించాడు. ఉప్పరులను ఓటు యంత్రాలుగా చూస్తున్న ప్రభుత్వాలను నిగ్గదీసి అడిగిండు. తన జాతిదుఃఖాన్ని సమాజం ముందు ఉంచాడు. బీసీసాహిత్యంలో తలమానికంగా తప్పకుండా నిలుస్తుంది. ఉప్పరుల జీవితాలపై వచ్చిన మొట్టమొదటి దీర్ఘకవిత్వం మెట్న దీర్ఘకవిత్వం





