-మణీందర్ గరికపాటి
ఎన్ని జ్ఙాపకాలు
తగలబడుతున్నాయో
పొగచూరిన ఆకాశంలా
చిమ్మచీకటి నిర్దయరాత్రి
నిద్రనుండి వెలివేయబడిన దేహం
కనుల కొలకులనుండి
ఒలికిపోయిన జాములు
ఒంటి పైకి అకస్మాత్తుగా
బీరతీగలాగా పాకుతున్న
ఎక్ల్సూసివ్ కలలు
ఈ వెన్నెల గాలిలో
ఆక్సిజన్ నిండుకుంది
ఇప్పుడు నేను ఏ గ్రహాంతరంలో ఉన్నాను
ఏ నీలి కుహరంలో మునిగిపోయాను
పగటి వస్త్రాన్ని వదిలేసి
గ్రావిటీకి దూరంగా విరూపంగా తిరుగుతున్నాను
ఏలియన్ దారుల్లో
నన్ను నేను గుర్తించలేకున్నాను
ప్రణాళికల రొద
వైఫై వలయంలా ఆవృతం
దాహం దాహం ఎంత తాగినా
తరగని చీకటి సముద్రపు నీరు
వెన్నెల ఫౌంటెన్ కింద
హంసలా జలకాలాడే
ఒకానొక దృశ్యం కోసం
ఎడతెగని ఒకటే మోహం





