కాలాతీత నవలా సంతకం

చెమ్మ : వారాల ఆనంద్

1950ల కాలంలో డాక్టర్ పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ తెలుగునవలల్లో అత్యంత ముఖ్యమైనది. ఇది ఆధునిక తెలుగు నవలా వికాసంలో మైలురాయి. మధ్యతరగతి కుటుంబాల జీవితం, స్త్రీ-పురుష సంబంధాలు, వ్యక్తిత్వ సంఘర్షణలు, ప్రేమ, వివాహం, స్త్రీ స్వేచ్ఛ, ఆత్మగౌరవం వంటి అంశాల్ని రచయిత్రి బాగా చిత్రించింది. నవలలోని ప్రధానపాత్ర ఇందిర. సంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ప్రశ్నించే, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే ధైర్యవంతురాలు. ఆమె జీవితంలో ఎదురయ్యే ప్రేమ, కుటుంబబంధాలు, సామాజిక ఒత్తిళ్లు, వ్యక్తిగత నిర్ణయాల చుట్టూరా కథ సాగుతుంది. ఇతరపాత్రల ద్వారా కూడా ఆ కాలంనాటి మధ్యతరగతి మనస్తత్వాలు, ఆశలు, నిరాశలు, విలువలు ప్రతిబింబిస్తాయి. ’కాలాతీత వ్యక్తులు’ నవలలో ఇందిర కేవలం ఒకపాత్ర కాదు, తన జీవితాన్ని తానే నిర్వచించుకోవాలనుకున్న ఒక తరం, ఒక యుగం. ఆమె నవలలో అడిగిన ప్రశ్నలు ఒక ఇంటిని కాదు, మొత్తం సమాజాన్ని కదిలించాయి. కాలం మారింది, దుస్తులు మారాయి, నగరాలు పెరిగాయి. కానీ వ్యక్తిత్వం కోసం మనిషి చేసే అన్వేషణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ నవల కాలాన్ని దాటి మనకాలంలోనూ శ్వాసిస్తుంది.

‘కాలాతీత వ్యక్తులు’ వ్యక్తి జీవితాన్ని సమాజం నిర్దేశించిన నియమాల ఆధారంగాకంటే స్త్రీ అయినా పురుషుడైనా ఆ మనిషి  వ్యక్తిత్వం, ఆలోచనలు, విలువల ఆధారంగా అర్థం చేసుకోవాలని సూచిస్తుంది. ఇందిర పాత్ర ద్వారా “మనిషి తన స్వభావాన్ని కోల్పోయి జీవించడం కంటే, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పోరాడటం గొప్పది”అని చెప్పారు. ఇది కేవలం స్త్రీ విముక్తి నవల మాత్రమే కాదు, వ్యక్తిస్వేచ్ఛకు సంబంధించిన నవల. మనిషి తనకుతాను నిజాయితీగా ఉండటంలోనే జీవిత సార్థకత ఉందనే భావన ఈ నవలకు తాత్విక మూలం.

ఇందిర అప్పటివరకు వచ్చిన తెలుగునవలల్లో అరుదుగా కనిపించే స్వతంత్ర ఆలోచనలున్న పాత్ర. ఆమె కేవలం కథానాయిక కాదు. కొత్త స్త్రీ చైతన్యానికి ప్రతీక. రచయిత్రి ఆయా పాత్రల అంతర్ముఖ సంఘర్షణలను అత్యంత సహజంగా, మనిషి మనస్తత్వంలోని సూక్ష్మకోణాలను వాస్తవికంగా ఆవిష్కరించారు. ఈ నవల తెలుగు సాహిత్యంలో అప్పటిదాకా స్త్రీని కేవలం త్యాగమూర్తిగా చూపించే రీతిలో కాకుండా స్వంతంగా ఆలోచించే వ్యక్తిగా, ఆయా పాత్రల అంతర్గత ప్రపంచాన్ని ఎంతో లోతుగా పరిశీలించింది. కాలాన్ని దాటి నేటికీ ప్రాసంగికంగా నిలిచే అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తెలుగు స్త్రీవాద సాహిత్యానికి ముందుమాటగా నిలిచిన రచనగా పరిగణించవచ్చు.

కాలాతీత వ్యక్తులు కేవలం నవల మాత్రమే కాదు. అది కాలం కంటే ముందుగా నడిచిన స్త్రీ అడుగుల ప్రతిధ్వని. సమాజం గీసిన గీతల మధ్య తన వ్యక్తిత్వాన్ని వెతుక్కుంటూ సాగిన ఇందిర ప్రయాణం. అందుకే ఈ నవలలోని పాత్రలు ఒక కాలానికి చెందినవైనా, అవి వేసిన ప్రశ్నలు కాలాతీతమైనవి. నవలలో బాహ్య సంఘటనల కంటే అంతర్ముఖ సంఘర్షణలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్రతిపాత్ర తనలోతాను యుద్ధం చేస్తుంది. కోరికలు, బాధ్యతలు, ప్రేమ, ఆత్మగౌరవం మధ్య జరిగే సంఘర్షణలే కథను ముందుకు నడిపిస్తాయి. ఈ కోణంలో చూస్తే, కాలాతీత వ్యక్తులు ఒక మానసిక సంఘర్షణాత్మక నవల. ఇది ఒకరకంగా తెలుగు సాహిత్యంలో ఆధునిక స్త్రీ పాత్ర నిర్మాణానికి దారితీసిన నవల. కాలాతీతవ్యక్తులు వ్యక్తిత్వవాద దృక్పథాన్ని ప్రతిపాదించిన రచనగానూ, సామాజిక వాస్తవికతను మానసిక విశ్లేషణతో మేళవించిన నవలగానూ చెప్పుకోవచ్చు.

డా. పి. శ్రీదేవి (పెమ్మరాజు శ్రీదేవి) కాలాతీత వ్యక్తులు నవలను 1957లో ‘తెలుగు  స్వతంత్ర’ పత్రికలో ధారావాహికంగా రాసారు. వృత్తిరీత్యా  వైద్యురాలు. విశాఖపట్నం ఆంధ్రామెడికల్ కాలేజీలో చదివి, డాక్టర్‌గా పనిచేశారు. చాలా తక్కువ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రచనాశైలి, తీసుకున్న ఆధునికభావాలు ఆమెను ఉత్తమరచయిత్రిగా నిలిపాయి. సమాజంలోని భిన్న మనస్తత్వాలు, స్త్రీల మానసికసంఘర్షణలు ఆమె రచనల్లో ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి.

‘కాలాతీత వ్యక్తులు’ నవల కేవలం నవలగానే కాకుండా సినిమా, రేడియో నాటకంగా కూడా రూపాంతరీకరణ చెందింది. ఆకాశవాణిలో ప్రసారమయిన కాలాతీత వ్యక్తులు  రేడియో నాటకీకరణను శివం చేయగా, తురగా జానకీరాణి నిర్వహించారు. ఈ నవల ‘చదువుకున్న అమ్మాయిలు’ పేర ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. త్రిపురనేని గోపిచంద్ సంభాషణల్ని రాసారు. (నాటకమూ సినిమాలు రెండూ యూట్యూబులో వున్నాయి.)

కాలాతీత వ్యక్తులు, రేవతీ స్వయంవరం, చక్రనేమి క్రమాన, వాళ్ళు పాడిన భూపాలం  లాంటి రచనలు ఆమెను తెలుగు సాహిత్యంలో నిలబెట్టాయి. పి. శ్రీదేవి 1929లో జన్మించి, 1961లో వెళ్ళిపోయారు. శ్రీదేవి జీవితకాలం చిన్నదే అయినా ఆమె సాహిత్యకాలం చాలా పెద్దది. ఆమెరాసిన పేజీలు చాలాకొద్దే కావచ్చు, కానీ ఆ పేజీల్లో ఆమెది స్త్రీ మనసు పలికిన స్వరం ఇప్పటికీ కొత్తగానే వినిపిస్తుంది. కాలం గడిచినా ఆమెపాత్రలు వృద్ధాప్యానికి లోనుకావు. అందుకే శ్రీదేవి పేరు తెలుగు నవలాచరిత్రలో కాలాతీత సంతకంగా మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *