– అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొంగులేటి
– ‘సర్’ పేరిట 13 కోట్ల వోట్లు తొలగించారని విమర్శ
– కాళేశ్వరం అక్రమాలపై ఫిర్యాదు చేసి ఏడాదవుతున్నా చర్యలు కరువు
– బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 3 : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ పెద్దలు పగటి కలలు కంటున్నారని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం దమ్మాయిగూడెంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను 187మందికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘాన్ని తొత్తుగా మార్చుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(‘సర్’) పేరిట దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించిందని, ఆ పార్టీని ఇక్కడి ప్రజలు నమ్మబోరని అన్నారు. తెలంగాణ నుంచి దిల్లీకి ఆర్ఆర్ టాక్స్ వెళ్తోందన్న అమిత్ షా ఆరోపణలు అర్థరహితమన్నారు. గతంలో తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందేనని విమర్శించారు. వోట్లు రక్షించాల్సిన కేంద్రం భక్షించిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసి అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, ఆత్మ కమిటీ నియోజకవర్గ చైర్మన్ చావా శివరామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జూన్ నాటికి కూసుమంచి హాస్పిటల్ సిద్ధం చేయాలి
కూసుమంచి మండల కేంద్రం సమీపంలోని గంగబండ తండా వద్ద రూ.45 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల హాస్పిటల్‌ను నిర్దిష్ట గడువు మేరకు జూన్ నాటికి సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ దివాకర టిఎస్, ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి స్లాబ్ దశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి అనారోగ్యం కలిగితే వారు ఆర్థికంగా చితికి పోకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఏదైనా జబ్బు చేస్తే రోడ్డున పడే పరిస్థితి ఉండేదని, తమ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆరోగ్య భరోసా అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా పేదలకు ఆర్థిక తోడ్పాటు కల్పించినట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అర్హులైన పేదలందరికీ లబ్ది చేకూరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు హఫీజుద్దీన్, జూకూరి గోపాలరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, వైద్య శాఖ ఈఈ టి.ఉమామహేశ్వర రావు, కూసుమంచి తహసీల్దార్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





