– ప్రభుత్వ స్పందన కోసం నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
దిల్లీ, నవంబర్ 4 : ఎన్నికల కమిషనర్ల విధులకు సంబంధించి జీవితకాలం కల్పించిన సంపూర్ణ రక్షణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్‌లు జాయ్‌మాల్య బాగ్చి, వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. 2023లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ పదవీకాలంలో అధికారిక హోదాలో తీసుకున్న చర్యలకు సంబంధించి చట్టపరమైన రక్షణను కల్పిస్తుంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల సమయంలో ఈ నిబంధన తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. వాస్తవానికి ఈ చట్టంలోని సెక్షన్ 16 ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ పదవీకాలంలో చేసిన ప్రకటనలు, తీసుకున్న చర్యలు లేదా నిర్ణయాలకు సంబంధించి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ నిబంధన ఎలాంటి మినహాయింపులు లేకుండా రక్షణ కల్పిస్తోందని, ఇది మంచి ఉద్దేశంతో చేయని పనులకు లేదా అధికారుల పరిధిలోకి రాని చర్యలకు కూడా వర్తిస్తుందని పిటిషనర్, సామాజిక కార్యకర్త, న్యాయవాది అరుణ్ కుమార్ అగర్వాల్ వాదించారు. ఇలాంటి సంపూర్ణ రక్షణ కల్పించడం వల్ల ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చర్యలకు వ్యతిరేకంగా పౌరులకు అందుబాటులో ఉండాల్సిన సివిల్, క్రిమినల్ పరిహారాలు లేకుండా పోతాయని వాదించారు. ఎన్నికల సంఘం స్వాతంత్య్రాన్ని పరిరక్షించడం అంటే దాని సభ్యులకు చట్టపరమైన జవాబుదారీతనం నుండి పూర్తి మినహాయింపు ఇవ్వడం కాదన్నారు. 2023 చట్టంలోని సెక్షన్ 16ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్)ను సవాలు చేస్తూ దాఖలైన వేరే పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో ఈ పిటిషన్‌ను కూడా విచారించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం సర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఓటర్లను వేధించడానికి లేదా భయపెట్టడానికి దీన్ని రూపొందించారా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు సమీప భవిష్యత్తులో లేనప్పుడు దిల్లీలో ఈ ప్రక్రియను నిర్వహించడంలో ఇంత అత్యవసరం ఎందుకు అని కూడా కోర్టు ప్రశ్నించింది.ఎన్నికల సంఘం కఠినమైన కాలపరిమితులపై పట్టుబట్టకూడదని, ఆలస్యంగా ఓటర్ల నమోదు పత్రాలను సమర్పించే ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో నమోదై, ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లను ఫారం 6ను మళ్లీ ఎందుకు నింపమని అడుగుతున్నారని కూడా ప్రశ్నించింది. ఒక ఓటరు నిర్లక్ష్యానికి వారి ఓటు హక్కును శాశ్వతంగా తీసివేసి మీరు శిక్షించగలరా అని జస్టిస్ బాగ్చి అడిగారు. తొలగించిన ఓటర్ల జాబితాలను స్థానిక భాషలలో బ్లాక్ స్థాయిలో ప్రదర్శించాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ విషయాలు తమ పరిశీలనలో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిటిషనర్లకు, ఓటర్లకు కూడా హామీ ఇచ్చింది. దిల్లీలో గడువును పొడిగించడం, గణన పత్రాలను ఆలస్యంగా సమర్పించడానికి అనుమతించడం వంటి విషయాలను పరిశీలిస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. సర్ విషయంలో తదుపరి విచారణ ఈనెల 19న జరగనుంది. ఎసఐఆర్ కింద ఒక పేరును తొలగించడం లేదా గడువు ముగియడం వల్ల ఒక ఓటరును ఓటర్ల జాబితాలో శాశ్వతంగా చేర్చకుండా నిరోధించలేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు పౌరులు జాబితాలో సవరణలు కోరవచ్చునన్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





