– ఇందిరమ్మ ఇండ్లకు మరిన్ని భూములను గుర్తిస్తున్నాం
– హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం
– ఈ-లాటరీతో నాలుగు నియోజకవర్గాల్లో 1920 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక
– 14 నియోజకవర్గాల్లో ఖాళీల భర్తీకి రేపు మరోసారి లాటరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : హైదరాబాద్‌లో సొంత ఇల్లు నిర్మించుకోడానికి భూములు కలిగి ఉన్న అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5500 ఇండ్లను మంజూరు చేసిందని, అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో స్థలాల లభ్యత తక్కువగా ఉన్నందున ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.వందల కోట్ల విలువ చేసే భూములను పేదల నివాసాల కోసం వినియోగిస్తూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. గోషామహల్, ముషీరాబాద్, ఎల్.బి.నగర్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కేటాయింపు లాటరీని శాసనభ్యుడు రాజాసింగ్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గాల్లో నిర్మించనున్న 1920 ఇండ్లకు లబ్దిదారులను ఈ-లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ రోజు లాటరీ తీసిన ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ పనులకు త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఆర్టీసీ భూములను కూడా ఇచ్చామని, అలాగే పోలీసు శాఖకు చెందిన భూములను సైతం వినియోగిస్తున్నామని తెలిపారు. మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు అనువైన భూములన్నిటినీ సేకరిస్తున్నామని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. వచ్చే బోనాల నాటికల్లా గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు ఆ నియోజకవర్గంలోనే సొంతింటి వసతి కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం చాలా మంచిదన్నారు. నియోజకవర్గంలో ఇంకా అనేకచోట్ల గృహ నిర్మాణాలకు అనువైన భూములను గుర్తిస్తున్నామని, వాటిలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి వసతిని కల్పించే వరకు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను నిరంతరం చేపడతామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ఇండ్ల నిర్మాణాల్లో లబ్దిదారులను కూడా భాగస్వాములను చేసి వారి పర్యవేక్షణలో నిర్మాణపు పనులు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే నామమాత్రంగా రూ.6 లక్షల ధరను నిర్ధారించామన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.40-50 లక్షల విలువ చేసే ఇంటిని నామమాత్రపు ధరకే అందించడమే కాక రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయాలని నిర్ణయించామన్నారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఈ-లాటరీ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. లాటరీలో ఎంపికైన వారికి వెంటనే ఎసఎంఎస్ ద్వారా సమాచారం చేరే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.
రేపు మాపప్ లాటరీ
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు పూర్తి అయిన 16 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో, ఇతర కారణాలతో రద్దయిన ఇండ్లను మాప్ అప్ లాటరీ ద్వారా లబ్దిదారులకు బుధవారం కేటాయించనున్నారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఇండ్లను కేటాయించగా వాటిలో 14 నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో సుమారు 1700 ఇండ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారి జాబితాలోని పేర్లతోనే ఈ-లాటరీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను https://youtube.com/@tghd.official యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





