– ప్రకృతి వ్యవసాయ రైతు నవీన్ విజయగాథ స్ఫూర్తిదాయకం
– మురసు తుఫాను నేపథ్యంలో పంట కోతలను వాయిదా వేయాలి
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: పంటల వైవిధ్యంతోపాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకుని సాగు చేపట్టాలని, తద్వారా రోజూ ఆదాయం పొందేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 113వ ఎపిసోడ్లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన సైనిక మాజీ మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సిహెచ్.నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయగాథను రైతులతో పంచుకున్నారు. భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయల సాగుతోపాటు పాడి పశువులు, నాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో బయో రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సైన్యంలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం అభినందనీయమన్నారు. ఇలాంటి విధానాలను ఇతర రైతులు కూడా అనుసరించాలని, తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న పంటల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసుకునే చిరు ధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతోపాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు అందించాలని సూచించారు. మురసు తుఫాను నేపథ్యంలో రైతులు పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచిస్తూ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమంలో వాతావరణ, భూగర్భ జల, నీటిపారుదల శాఖల అధికారులు ఎల్‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు, సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యతపై వివరించారు. అలాగే, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, పశుగ్రాస పరిశోధనా కేంద్రం, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు యాసంగిలో తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటల సాగు, మామిడి తోటల్లో పూత, పిందె దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత
రైతుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రసాయన, పురుగు మందులను అవసరమైన మేరకు, శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే వినియోగించాలని, పిచికారీ సమయంలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు. పురుగుమందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ, పురుగుమందుల తయారీదారుల సంఘం రూపొందించిన ‘ఇది చేయి-ఇది చేయవద్దు’ భద్రతా చార్టును రైతులకు అందుబాటులోకి తెచ్చారు. రైతు వేదికల్లో రైతులకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. యూపీఐ డిజిటల్ చెల్లింపుల వినియోగంపై ఎన్పీసీఐ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంత్రి మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించి ‘రైతు నేస్తం’ ద్వారా క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి, ఆర్టీసి ఎండీ నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





