– జీవోల కారణంగా మన బిడ్డలు రక్షణ కోల్పోయే ప్రమాదం
– టీఆర్ఎస్ చీఫ్ కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : మెడికల్ సీట్లలో స్థానికత మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవోలు 33, 150ల కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోలతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి జీవోలను రద్దు చేయాల్సింది పోయి సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ దాన్ని డిఫెండ్ చేయటమేమిటనీ ప్రశ్నిస్తూ సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడి ప్రజలకు అన్ని రంగాల్లో సర్వ హక్కుల కోసమని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ హక్కులనే హరించేలా జీవోలు తెస్తోందని మండిపడ్డారు. 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన వాళ్లను స్థానికులుగా భావించాల్సిందిపోయి 8 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ చదివిన వాళ్లకు స్థానికులుగా అవకాశం ఇవ్వటమేమిటని ఆమె నిలదీశారు. దీని కారణంగా తమ పిల్లలు నష్టపోతున్నారని ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ సీట్లలో తీసుకొచ్చిన ఈ స్థానికత విధానాన్ని రేపు అన్ని రంగాల్లో అమలు చేస్తారని, అదే జరిగితే తెలంగాణ యువత పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.
జీవోలకి వ్యతిరేకంగా గళమెత్తాలి
ప్రభుత్వం తెచ్చిన జీవోలు తెలంగాణకు విపత్తు లాంటివని కవిత హెచ్చరించారు. దీనిపై తెలంగాణ సమాజమంతా ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ఈ అంశంపై గళమెత్తాలని, విద్యార్థులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అదేవిధంగా మేధావి వర్గం, యువత, విద్యార్థులు కూడా ఈ జీవోలను వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికే గ్రూప్ -1లో స్థానికత అంశం కారణంగా తెలంగాణ విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని కవిత హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





