– 960 సంఘాల సమష్టి మద్దతుతో నూతన నాయకత్వం ఎన్నిక
– ఐక్యత, పునర్నిర్మాణం దిశగా మరో ముందడుగు
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : మెనోనైట్ బ్రద్రెన్ (ఎంబీ) కాన్ఫరెన్స్ పరిధిలోని సుమారు 960 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ గ్రూపుల సమష్టి సహకారంతో నూతన గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) ఎన్నికలు ఎం.బి.మిషన్ కాంపౌండ్, మహబూబ్‌నగర్‌లో ఏకగ్రీవంగా జరిగాయి. వివిధ ఫీల్డుల నుంచి హాజరైన సుమారు 2,000 మంది స్త్రీ, పురుషుల సమక్షంలో 53మంది డెలిగేట్లు నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారీ జనసమూహం మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో నాయకత్వ ఎంపిక ఏకగ్రీవంగా జరగడం ఎంబీ కాన్ఫరెన్స్‌లో ఐక్యత, సమష్టి బాధ్యత, సంస్థాగత పునరుద్ధరణ పట్ల సభ్యులకున్న ఆకాంక్షకు నిదర్శనంగా నిలిచింది.
నూతనంగా ఎన్నికైన గవర్నింగ్ కౌన్సిల్
ప్రెసిడెంట్‌గా రెవ. డాక్టర్ సీఎస్.జోయెల్, వైస్ ప్రెసిడెంట్‌గా సహో. కేఈ రాజారత్నం, జనరల్ సెక్రటరీగా రెవ. ఎ.శ్యామ్ రావు, అసోసియేట్ సెక్రటరీగా రెవ. ఇ.ప్రసాద్, కోశాధికారిగా రెవ. బండారి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సహో. వి.వందనం, సహో. జీజీ పాల్ ఎన్నికయ్యారు.
సంస్థ పునర్నిర్మాణం, అభివృద్ధే నూతన నాయకత్వ లక్ష్యం
సుమారు 960 సంఘాలతో విస్తరించి ఉన్న ఎంబీ కాన్ఫరెన్స్‌ను తిరిగి అభివృద్ధి పథంలో నడిపించడం నూతన గవర్నింగ్ కౌన్సిల్ ప్రధాన కర్తవ్యమని నూతన అధ్యక్షుడు రెవ. డాక్టర్ జోయెల్ పేర్కొన్నారు. కొంతకాలంగా నిలిచిపోయిన సంస్థాగత కార్యక్రమాలను పునరుద్ధరించడం, కోల్పోయిన సంస్థ ఆస్తులను తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టడం, ప్రస్తుతం ఉన్న ఆస్తులను సమర్థవంతంగా పరిరక్షించడం, ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటించడం తమ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. అలాగే ఎంబీ కాన్ఫరెన్స్ పరిధిలోని అన్ని అనుబంధ విభాగాలను బలోపేతం చేసి వాటి ద్వారా నిలిచిపోయిన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో సంస్థ గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు సమష్టి కృషి చేయాలని జోయెల్ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





