ఎఫ్‌ఎంజీలకూ రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలి

– సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్Y 12 : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట 34 రోజులుగా నిరసన తెలుపుతున్న విదేశీ వైద్య పట్టభద్రు(ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్-ఎఫ్‌ఎంజీ)లపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించి లాఠీచార్జి చేసి ఈడ్చుకెళ్లి అక్రమ కేసులు బనాయించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. సమస్యను చెప్పుకునేందుకు తనను కలిసిన ఎఫఎంజీ వైద్య విద్యార్థులకు భరోసా ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ ఎంతోమంది రాష్ట్ర విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్య విద్యనభ్యసించి తిరిగి స్వదేశానికి వస్తున్నారని తెలిపారు. భారత్‌కు వచ్చిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిర్వహించే అత్యంత కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలో (ఎఫ్‌ఎంజీఈ) వేలాదిమంది పోటీ పడితే వందల సంఖ్యలో మాత్రమే ఉత్తీర్ణులవుతారని తెలిపారు. ఆ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత స్థానిక మెడికల్ కాలేజీలలో చదివిన వైద్య విద్యార్థుల మాదిరిగానే వీరు కూడా ప్రభుత్వ దవాఖానాల్లో హౌస్ సర్జన్లుగా (సీఆర్‌ఎంఐ- ఇంటర్న్‌షిప్) సమానంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. స్థానిక హౌస్ సర్జన్లకు ప్రభుత్వం రూ.30 వేల వరకు స్టైపెండ్ అందిస్తుండగా సమాన విద్యార్హత ఉండి అంతేస్థాయిలో శ్రమిస్తున్న ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లకు రూ.5 వేలు మాత్రమే చెల్లించడం తీవ్ర వివక్ష అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలని, ఇతర హౌస్ సర్జన్లతో సమానంగా స్టైపెండ్, అలవెన్సులు అందించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పొరుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొన్ని రోజులుగా మెడికల్ కౌన్సిల్ ముందు నిరాహార దీక్షలు చేస్తున్న వైద్య విద్యార్థులపై ప్రభుత్వం కనీసం పరిశీలిస్తాం అనే సానుభూతి మాట కూడా మాట్లాడకపోగా పోలీసులతో దౌర్జన్యం చేయించి తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటని రామచందర్ రావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌లందరికీ ఇతర హౌస్ సర్జన్లతో సమానంగా నెలకు రూ.29,792 స్టైపెండ్‌తోపాటు జనవరి 2026 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ డిమాండ్‌ను అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి పడే ఆర్థిక భారం రూ.2 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. వైద్య విద్యా రంగానికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కనీసం రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయలేదా అని రామచందర్‌రావు ప్రశ్నించారు. ఎఫ్‌ఎంజీ విద్యార్థుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ సంఘీభావం తెలుపుతోందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *