– నియామక పత్రం అందజేసిన మంత్రులు పొన్నం, తుమ్మల
– మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఇటీవల సమ్మె చేసిన సమయంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున పరిహారం అందజేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. యావత్ ఆర్టీసీ ఉద్యోగులు ఒక రోజు వేతనం దాదాపు రూ.కోటి అందించి కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ఇచ్చిన హామీ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో రికార్డు ట్రెజర్‌గా నియమించగా నియామక పత్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చేతుల మీదుగా గురువారం అందజేశారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత.. ఉద్యోగులను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ భౌతికంగా దాడులకు పాల్పడవద్దని ప్రయాణికులకు హితవు పలికారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రయాణికులు మర్చిపోయిన లక్షల విలువైన వస్తువులను నిజాయతీగా తిరిగి అప్పగిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎందరో ఉన్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సుల ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏ గ్రామానికైనా బస్సు సౌకర్యం అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాలని, రూట్ వెరిఫికేషన్, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు వెంకన్న, బాబురావు, ఇతర ముఖ్య నేతలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





