– కుట్రలతో బీజేపీ గెలిచింది
– ప్రధాన విలన్ ఎన్నికల కమిషనర్ : మమతా బెనర్జీ వ్యాఖ్యలు
– ప్రధాన విలన్ ఎన్నికల కమిషనర్ : మమతా బెనర్జీ వ్యాఖ్యలు
కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందని ఆరోపించారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని విమర్శలు గుప్పించారు. వందకుపైగా సీట్లు లూటీ చేశారని, తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, అందువల్ల తాను రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదని అన్నారు. లోక్‌భవన్‌కు వెళ్లనని, రాజీనామా చేయమని తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా సమావేశంలో మంగళవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈసీ, బీజేపీలపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేసిందని, అమిత్ షా, ప్రధాని మోదీలు కలిసి కుట్రలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో విలన్‌గా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు.. బెంగాల్‌లో ఈవీఎంలను లూటీ చేశారు అని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80 నుంచి 90 శాతం కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండటం ఏమిటని ప్రశ్నించారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అధికారులు తమ పార్టీపై దాడులు, కార్యకర్తల అరెస్టులు చేశారని అన్నారు. భవానీపూర్‌లో ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ ప్రకారం తనను ఓడించారని, ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగపరిచి బీజేపీ విజయం సాధించిందని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనను సీఆర్‌పీఎఫ్ గూండాలు పొత్తికడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్‌ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించారని, కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల వోట్లు చేర్చారని, టీఎంసీని ఓడించేందుకు అన్ని రకాలుగా ఎత్తుగడలు పన్ని వంద సీట్ల వరకూ బీజేపీ లూటీ చేసిందని విమర్శించారు. ఈ మొత్తం ఉదంతంలో ‘ఇండి’ కూటమి తనవైపే ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తదితరులు ఫోను చేసి మద్దతుగా నిలిచారని చెప్పారు. ‘ఇండి’ కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



