– హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం
– బస్టాండ్ ఎదుట బంధువుల రాస్తారోకో
జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ వికటించి రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండాకు చెందిన గుగులోతు మంజుల (28) అనే వివాహిత శనివారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, తండావాసులు మృతదేహంతో ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. గుగులోతు మంజులకు ఐదు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో ఎర్రగొల్లపాడుకు చెందిన ఓ ఆర్ఎంపీ సలహాతో కుటుంబ సభ్యులు ఆమెను జనగామలోని ఓ ప్రవేట్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షలు నిర్వహించి, గర్భసంచిలో బుడగలు ఉన్నాయని, తక్షణమే ఆపరేషన్ చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆపరేషన్ చేసి ఐదు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుకుని అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన మరుసటి రోజే మంజులకు తీవ్రమైన జ్వరం, వాంతులు కావడంతో శనివారం మళ్లీ అదే హాస్పిటల్కు తీసుకువచ్చారు. పరిస్థితి విషమిం చడంతో ఆసుపత్రి యాజమాన్యం బయటప డేందుకు సొంతంగా అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బ్లడ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైందని చెప్పారు. అయితే అక్కడ పరిస్థితి విషమించి మంజుల శనివారం తెల్లవా రుజామున మృతిచెందింది.
బోర్డుపై ఒకరి పేరు.. ఆపరేషన్ చేసింది మరొకరు
సదరు హాస్పిటల్ బోర్డుపై ముగ్గురు అర్హత కలిగిన ప్రముఖ వైద్యుల పేర్లు రాసి ఆపరేషన్ మాత్రం ఓ అనస్థీషియా డాక్టర్ తో చేయించారని మృతురాలి భర్త శ్రీనివాస్, కూతురు జ్యోతి ఆరోపించారు. వెంటిలేషన్ కూడా లేని ఓ చిన్న చీకటి గదిలో నిబంధనలకు విరుద్ధంగా
ఆసుపత్రి నడుపుతున్నారని తెలిపారు. మంజుల మృతికి కారణమైన ఆసుపత్రి వైద్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం.. బస్టాండ్ ఎదుట రాస్తారోకో 
హైదరాబాద్ నుంచి మృతదేహంతో నేరుగా సంధ్యా హాస్పిటల్ కు చేరుకున్న బాధితులు హాస్పిటల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అప్పటికే డాక్టర్, సిబ్బంది హాస్పిటల్ కి తాళం వేసి పరారయ్యారు. అనంతరం బాధితులు సిద్దిపేట రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ రెడ్డి ఎస్సైలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





