– పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వరి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి రంగంపల్లిలో సో అండ్ రీప్ క్లైమాటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి సమర్థ వినియోగ పద్ధతులను అవలంబించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంప్రదాయ సాగు విధానాల నుంచి ఆధునిక పద్ధతుల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో రైతులను ఆధునిక వరి సాగు పద్ధతుల వైపు ప్రోత్సహించేందుకు సో అండ్ రీప్ క్లైమాటెక్ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు, అలాగే ఆ సంస్థ చేస్తున్న బయోచర్, బయోగ్యాస్, ఆగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్టులు ఉమ్మడి కరీంనగర్‌లో ప్రారంభించడానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి విజయవంతమైన రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు రైతులు ప్రత్యామ్నాయ తడిపి-ఆరబెట్టే విధానం వంటి ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. సో అండ్ రీప్ క్లైమాటెక్ సీవోవో ఎన్.మురళీధర్ మాట్లాడుతూ వరి సాగులో నీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా రైతులకు నీటి పొదుపుతోపాటు సాగు సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. రైతులు కొత్త పద్ధతులను స్వీకరించి వాటి ప్రయోజనాలను అనుభవంలోకి తీసుకురావడం ద్వారా నీటి వనరుల సంరక్షణకు, స్థిరమైన వ్యవసాయానికి బలమైన పునాది వేయగలరని తెలిపారు. సంస్థ డైౖరెక్టర్ డి.దివ్యా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను స్వీకరించి నీటిని పొదుపు చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం తమ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. తడిపి-ఆరబెట్టే విధానాన్ని పాటించడం ద్వారా మీథేన్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ కంఠయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీనాథ్, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పెద్దపల్లి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్, హైకోర్టు అడ్వకేట్, యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్దార్తి నవీన్, ఎంఏఓ నాగార్జున పాల్గొన్నారు. సో అండ్ రీప్ ఆపరేషన్స్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ, ఎన్‌బీఎస్ హెడ్ పృథ్వీరామ్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పి.స్వప్న, సంస్థ బృందం, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





