మంత్రనగరి సరిహద్దుల్లో: రఘు వగ్గు

ఇంకా వారి వెన్నుపూసలపై అధికారం

ప్రజాస్వామ్య లేపనంతో తాండవిస్తూనే ఉంది

ధిక్కార స్వరాలను ఖననం చేసేందుకు

మంత్రదండానికి రంగులు మారుస్తూనే

ఓ పక్క పీఠాన్ని తొణకనివ్వక

ఇంకో పక్క అత్యంత ప్రమాదకారులుగా

చిత్రించాలి కదా వారినీ

కావల్సినన్ని కావల్సినప్పుడు

అణచివేత గుళికలు వేయాలి

ఆ మొలకలేమో మళ్ళీమళ్ళీ ఉబికివస్తాయ్

ఎర్రటి సూర్యుని ఆలింగనంతో

నిప్పులు రువ్వుతున్న వదనాలతో

ప్రజానేమో ముక్కలుముక్కలు చేయబడాలి

వాళ్ళూ వీళ్ళూ ఇంకెవరెవరో

తుదకు ప్రభువులవైపే తూకం వచ్చేట్టు

మన తమ్ముళ్ళ చెల్లెళ్ళ తలలు తెగిపడినా

మనలోని ప్రశ్నను అటువైపు మళ్ళించుకుని

ఇటువైపు మన గుండెలకే గురిపెట్టినా

మనలో మనకు తెలియకుండానే పార్టీషన్ చేసి

మన స్పృహను మనకు లేకుండా చేసినా

చివరికి మనలో మనం ద్వేషించుకునేట్టు

ఆ నాట్యం రచించబడితే

వాహ్ రే క్యా బాత్ హై

మరి మనం ఆ మంత్రనగరి సరిహద్దులను

చేధించి ఆ అప్రజాస్వామ్య  ముసుగును

తొలగించి చరమగీతం పాడితే

తెర పడిపోతుంది కదా

రంగస్థలంపై దీపాలారిపోయి

ప్రేక్షకాగారంలో వెలుగుతాయి కదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *