– స్వయం ఉపాధికి వృద్దుడి అక్రమ మార్గం
– ఏడాదిగా ఇంట్లోనే వైన్ తయారీతో ధనార్జన
– దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 8: యూట్యూబ్ వేదికగా వైన్ తయారీ నేర్చుకుని ఇంట్లోనే అక్రమంగా వైన్ తయారు చేస్తున్న ఓ వృద్ధుడి గుట్టును మల్కాజ్‌గిరి డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. వృద్దాప్యంలో స్వయం ఉపాధి మార్గం అన్వేషించే క్రమంలో ఈ అక్రమ దందాకు తెరలేపిన ఆంటోనీ పీటర్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది కలిసి ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు ఆంటోనీ పీటర్ ఏడాది కాలంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు రకాల ఫ్లేవర్లలో వైన్ తయారు చేస్తూ 750 ఎంఎల్ బాటిల్‌ను రూ. 300 చొప్పున విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ద్రాక్ష, పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, బనానాలతోపాటు ఆఖరికి తమలపాకు ఫ్లేవర్‌తో కూడా వైన్ తయారు చేస్తుండటం గమనార్హం. వివిధ రకాల పండ్లను దాదాపు 15 రోజులపాటు సహజ సిద్ధంగా ఫార్మెంటింగ్ (పులియబెట్టడం) చేసి.. ఆ రసంలో పంచదార, గోధుమలు కలిపి వడకట్టి వైన్‌గా మారుస్తున్నాడు. పండ్లను 15 రోజుల పాటు పులియబెట్టడం వల్ల ఆ రసంతోపాటు సహజంగానే అందులో ఆల్కహాల్ శాతం కూడా వస్తుందని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ పరీక్షలు లేకుండా తయారు చేసిన వైన్‌ను నిందితుడు నేరేడ్‌మెట్, సికింద్రాబాద్, కాప్రా పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి సుమారు 377.7 లీటర్ల వైన్‌ను, దాన్ని ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉంచిన 502 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ నిల్వల విలువ మార్కెట్లో రూ.1.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఈ వైన్ తయారీ వ్యవహారాన్ని చాకచక్యంగా ఛేదించిన డీటీఎఫ్ బృందాన్ని మల్కాజ్‌గిరి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్ బి. హన్మంతరావు ప్రత్యేకంగా అభినందించారు. స్వాధీనం చేసుకున్న వైన్ నిల్వలతోపాటు నిందితుడు ఆంటోనీ పీటర్‌ను చట్టపరమైన చర్యల నిమిత్తం కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



