“స్టాలిన్ అయినా, మావో అయినా లేదా షీ అయినా సరే, తమ విధానాలను అమలు చేయడంలోనూ, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలోనూ వారందరూ స్పష్టమైన హేతుబద్ధతతో వ్యవహరిస్తారు,” అని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ ఫెలో గువోగువాంగ్ వూ అన్నారు. “వారు కచ్చితంగా కఠినాత్ములు—వారి నిర్ణయాలు లేదా వ్యూహాల్లో భావోద్వేగాలకు తావుండదు..”
(చున్ హాన్ వాంగ్,’మింట్ ‘ సౌజన్యంతో )
చైనా నాయకుడు షీ జిన్‌పింగ్, తన పాలనను పొడిగించుకోవవడంకోసం, ప్రతిపక్షాన్ని అణచివేసి, నాయకత్వాన్ని తన అనుచరులతో నింపడానికి, ఒకప్పుడు జోసెఫ్ స్టాలిన్, మావో జెడాంగ్ అమలుచేసిన నిరంకుశ వ్యూహాలను అనుసరిస్తున్నారు. 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్ట్ నాయకులను గుర్తుచేస్తూ, షీ డజన్ల కొద్దీ సీనియర్ అధికారులను—తన సొంత శిష్యులతో సహా—తొలగించారు, వ్యక్తి ఆరాధన సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా తనకు సంపూర్ణ విధేయంగా ఉండేవిధంగా జాగ్రత్తపడ్డారు. దేశ శక్తిని విస్తరించడానికి, సైనిక శక్తి, ఆర్థిక బలం విషయంలో అమెరికాకు దీటుగా నిలవడానికి, రాబోయే సంవత్సరాల్లో చైనా భవిష్యత్తును నిర్దేశించడం ఆయన లక్ష్యం. పార్టీ నాయకుడిగా ఇప్పుడు తన 14వ సంవత్సరంలో ఉన్న 73 ఏళ్ల షీ, ఏకవ్యక్తి పాలన తిరిగి రాకుండా నిరోధించడానికి మావో తర్వాత ప్రవేశపెట్టిన సంప్రదాయాలను తొలగించారు. కానీ ఇటువంటి నియంతృత్వ ఎత్తుగడలతో ప్రమాదాలు కూడా ఉన్నాయి. చర్చలను అణచివేసి, భయాందోళన వాతావరణాన్ని రెచ్చగొట్టడం ద్వారా, షీ విధాన రూపకల్పనను మరింత ఏకపక్షంగాను, తప్పులను సరిదిద్దుకోవడానికి దాదాపుగా వీల్లేకుండా చేశారు. స్పష్టమైన వారసత్వ ప్రణాళిక లేకపోవడంవల్ల, షీ కి కూడా స్టాలిన్, మావోలకు పట్టిన గతే పట్టే ప్రమాదం ఉంది. పదవిలో ఉండగా వారి మరణాలు అధికార పోరాటాలను రేకెత్తించి, చివరికి వారి రాజకీయ దృక్పథాలను విచ్ఛిన్నం చేశాయి.
ప్రత్యర్థుల ఏరివేత
స్టాలిన్, మావోలు తమ సంపూర్ణ అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో ప్రత్యర్థులను తొలగించి, అసమ్మతిని అణచివేశారు. ఈ ఇద్దరు నాయకులు విస్తృత స్థాయిలో చేపట్టిన ప్రక్షాళనల వల్ల లక్షలాది మంది అధికారులు, మేధావులు, సాధారణ పౌరులు జైలు, నిర్బంధ చాకిరీలో మగ్గుతూ మరణానికి గురయ్యారు. వినాశకరమైన సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించడంలో, మావో ఆరోపించిన ప్రతివిప్లవకారులపై దాడి చేయడానికి ఉత్సాహవంతులైన యువతను సమీకరించి, మూక హింసను మరియు సామాజిక అశాంతిని రేకెత్తించారు. షీ అటువంటి మతోన్మాదాన్ని విడనాడినప్పటికీ, మావో శకం తర్వాత ఎన్నడూ చూడని వేగంతో, స్థాయిలో ఉన్నతాధికారులను తొలగించారు. అంతులేని అవినీతి ఆరోపణలు, రాజకీయ అసమ్మతి, అధికారులు షీ పట్ల తమ విధేయతను ప్రదర్శించేలా ఒత్తిడి చేయడం, అలాగే ఎవరూ తనను బలహీనపరచకుండా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒకే వ్యక్తి జీవితాంతం చైనాను పాలించే మావో తరహా నిరంకుశత్వం తిరిగి రాకుండా నిరోధించడానికి దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన రక్షణ కంచెలను షీ పక్కకు నెట్టారు. అధికారంలోకి వచ్చిన తన మొదటి దశాబ్దంలో, షీ సీనియర్ అధికారులకు వయోపరిమితితో కూడిన పదవీ విరమణ నిబంధనలను పక్కనపెట్టారు. చైనా అధ్యక్ష పదవికి ఉన్న రెండు పర్యాయాల పరిమితిని రద్దు చేశారు. తద్వారా పార్టీ అధిపతిగా, దేశాధినేతగా నిరవధికంగా కొనసాగడానికి తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు. మావో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా అత్యంత సుదీర్ఘమైన పదవీకాలాన్ని ఇప్పటికే పూర్తిచేసిన షీ, 2027లో పార్టీ అధిపతిగా నాలుగవ ఐదేళ్ల పదవీకాలాన్ని, ఆ తర్వాతి సంవత్సరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పార్టీ నాయకుడిగా తన మొదటి రెండు పర్యాయాలలో, షీ కీలక విధాన నిర్ణయాధికారాలను తన చేతుల్లోనే కేంద్రీకరించుకున్నారు. ఆర్థిక ప్రణాళిక నుండి జాతీయ భద్రత వరకు ప్రతి దానిపై వ్యక్తిగత నియంత్రణను ప్రదర్శించారు. తన మూడవ పర్యాయంలో, షీ కొన్ని బాధ్యతలను 60 ఏళ్ల చివర, 70 ఏళ్ల ప్రారంభంలో ఉన్న కొద్దిమంది విధేయులకు అప్పగించారు. వీరు సమర్థవంతమైన వారసులుగా పరిగణించాలంటే, వీరి వయసు చాలా అధికంగా ఉండటం గమనార్హం. పార్టీ అంతర్గత వర్గాల ప్రకారం, ఏడుగురు సభ్యులున్న పార్టీ నాయకత్వ మండలిలోకి, తగిన వారసుడిగా ఉండటానికి సరిపడా యువకులు, అనుభవం ఉన్నవారిని ఆయన ఎవరినీ పదోన్నతి కల్పించలేదు.
“ఒకే వ్యక్తి జీవితాంతం చైనాను పాలించే మావో తరహా నిరంకుశత్వం తిరిగి రాకుండా నిరోధించడానికి దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన రక్షణ కంచెలను షీ పక్కకు నెట్టారు. అధికారంలోకి వచ్చిన తన మొదటి దశాబ్దంలో, షీ సీనియర్ అధికారులకు వయోపరిమితితో కూడిన పదవీ విరమణ నిబంధనలను పక్కనపెట్టారు. చైనా అధ్యక్ష పదవికి ఉన్న రెండు పర్యాయాల పరిమితిని రద్దు చేశారు. తద్వారా పార్టీ అధిపతిగా, దేశాధినేతగా నిరవధికంగా కొనసాగడానికి తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు..”
చైనా పంచవర్ష ప్రణాళికల వంటి ప్రధాన విధానాలపై నిర్ణయాధికారాన్ని షీ మరింత కేంద్రీకరించారు. ఈ ప్రణాళికలు ఆర్థిక వ్యవస్థకు లక్ష్యాలను నిర్దేశించి, వాటిని సాధించడానికి ప్రభుత్వ వనరులను కేటాయిస్తాయి. చైనా ప్రభుత్వం గతంలో తన పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేసేటప్పుడు ప్రపంచ బ్యాంకు, అమెరికన్ ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ వంటి విదేశీ సంస్థలు మరియు నిపుణులను సంప్రదించేది. కానీ షీ అటువంటి సలహాలను తిరస్కరిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ఈ ప్రక్రియపై గట్టి నియంత్రణను కలిగి ఉన్నారు. తాజా ప్రణాళిక కోసం, ఆయన తన విశ్వసనీయ ప్రతినిధి అయిన ప్రధానమంత్రి లీ కియాంగ్‌కు మరింత క్రియాశీలక పాత్రను ఇచ్చారు. ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక విశ్లేషణ ప్రకారం, ప్రణాళికను రూపొందించేటప్పుడు ఆయన సలహాదారులు కింది స్థాయి అధికారులు మరియు బయటి నిపుణుల నుండి తక్కువ సూచనలను స్వీకరించారు. పర్యవసానంగా ఒక ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి చైనా వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందనే సంకేతాలను జి ఇప్పటివరకు పెడచెవిన పెట్టారు.
పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనను నిశితంగా నిర్దేశించే విస్తృతమైన నియమ నిబంధనల వ్యవస్థ ను మరియు దాని అమలును షీ ఏర్పాటు చేశారు. మావో తర్వాత వచ్చిన తన పూర్వ పాలకులం దరినీ మించి, ఆయన పరిపాలన విధులు,ప్రవర్తనకు సంబంధించిన పార్టీ నిబంధనలను ఈ వ్యవస్థ చాలా వేగంగా అమలు చేసింది లేదా సవరించింది. ఈ నియమాలను అమలు చేయడానికి, పార్టీ 10 కోట్ల మంది సభ్యులను నిశితంగా పరిశీలించడానికి, వారి విధేయతను పర్యవేక్షించడానికి, పార్టీ అత్యున్నత అంతర్గత పర్యవేక్షక సంస్థ అయిన ‘సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్స (సీసీడీఐ)కు షీ అధికారం ఇచ్చారు. బీజింగ్, ప్రధాన పార్టీ,ప్రభుత్వ సంస్థలలో సీసీడీఐ అధికారులను నియమించడమే కాకుండా దేశవ్యాప్తంగా తనిఖీ బృందాలను మోహరించింది.
తనకు ముందున్న స్టాలిన్, మావోల వలె, షీ కూడా తనను తాను తన తరంలోనే గొప్ప కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తగా చిత్రీకరించుకుంటారు. ఆయన ప్రధాన విధానాల ఘనతను తనకే ఆపాదించుకుంటారు. వాటిని తన సొంత రాజకీయ తత్వానికి ముడిపెడతారు. ఈ తత్వాన్ని “నూతన శకానికి చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిజంపై షీ జిన్‌పింగ్ ఆలోచన” అని పిలుస్తారు. దీనిని “మావో జెడాంగ్ ఆలోచన”తో పాటు కమ్యూనిస్ట్ పార్టీ చార్టర్ మరియు చైనా రాజ్యాంగంలో పొందుపరిచారు. కొత్త నిబంధనల ప్రకారం, పార్టీలో చేరాలనుకునే సభ్యులందరూ ప్రవేశ ప్రక్రియలో భాగంగా “షీ జిన్‌పింగ్ ఆలోచన”ను అధ్యయనం చేయాలి. పార్టీలో చేరిన తర్వాత, సభ్యులు షీ విధానాలపై జరిగే క్రమమైన అధ్యయన సమావేశాలలో తప్పనిసరిగా పాల్గొనాలి. చైనా పునరుజ్జీవనంలో షీ కేంద్ర, అనివార్యమైన వ్యక్తి అంటూ పార్టీ ప్రచారం చిత్రీకరిస్తుంది.





