– పారిశుధ్యం, వైద్య సేవలపై దృష్టి పెట్టాలి
– విద్యార్థుల సంక్షేమం, వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు, వేడి నీరు, పారిశుధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సకాలంలో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడైనా బోధన సిబ్బంది కొరత ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్ల అనుమతితో నిబంధనల ప్రకారం తాత్కాలిక నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, ప్రతి గురుకులంలో ముందస్తు ఆరోగ్య ప్రణాళిక అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు వేడి నీరు అందుబాటులో ఉంచాలని, నీటి ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అవసరమైనచోట వాటర్ ప్యూరిఫయర్లు, క్లోరినేషన్, ఫిల్టరేషన్ సదుపాయాలను సమర్థంగా వినియోగించాలన్నారు. బాలికల గురుకులాలు, హాస్టళ్లలో మరింత అప్రమత్తత అవసరమని మంత్రి పేర్కొన్నారు. టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శానిటరీ న్యాప్‌కిన్ల అందుబాటు, డిస్పోజబుల్ యూనిట్లు, మహిళా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, అవసరమైనచోట మహిళా కౌన్సెలర్ల సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి గురుకులంలో ప్రాథమిక అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ హాస్పిటల్స్‌తో సమన్వయం చేసుకుని విద్యార్థులకు నిరంతర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మవ్యాధులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే చికిత్సకు పంపే విధంగా ఆరోగ్య ప్రొటోకాల్ అమలు చేయాలని సూచించారు. నాణ్యమైన కూరగాయలు, పాలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల సరఫరా నిరంతరంగా జరిగేలా పర్యవేక్షించాలని, ఆహార పదార్థాల నాణ్యతను తరచుగా తనిఖీ చేయాలని చెప్పారు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను దశలవారీగా విస్తరించేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ, ఉన్నత విద్యావకాశాలు మరింత చేరువయ్యేలా సీవోఈల విస్తరణకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల వేతనాలు ప్రతి నెలా ఒకటో తేదీన జమయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థల ప్రధాన కార్యాలయ స్థాయి నుంచి జిల్లా, పాఠశాలస్థాయి వరకు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గురుకులంలో వర్షాకాల ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, ఆహార నాణ్యతపై వారానికోసారి నివేదికలు తీసుకోవాలని, లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దాలని సూచించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సంతోష్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి కంభంపాటి శారద, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అదనపు కార్యదర్శి నటరాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





