మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ

– పార్టీ అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్
– 141 కేసుల్లో నిందితుడు.. రూ.2కోట్ల రివార్డు

భ‌ద్రాచ‌లం, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రాను అరెస్ట్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. మిసిర్ బేస్రా నక్సల్స్‌ సంస్థలో కీలక స్థాయిలో ఉన్న నేతగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణ, వ్యూహాల రూపకల్పనలో అతడికి ముఖ్యమైన పాత్ర ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో మిసిర్ బేస్రాతో పాటు మరో ఇద్దరు నక్సల్స్‌ నేతలు మోచూ, గౌరవ్ హాన్స్‌దాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి అరెస్టుతో రాష్ట్రంలోని నక్సల్ నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, మిసిర్ బేస్రా కోసం భద్రతా బలగాలు చాలా కాలంగా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి. అతడి కోసం జార్ఖండ్‌లోని అడవి ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత జిల్లాల్లో గతంలో పలు భారీ ఆపరేషన్లు నిర్వహించారు. మిసిర్ బేస్రా అరెస్ట్ మావోయిస్టు సంస్థకు వ్యూహాత్మకంగా పెద్ద నష్టంగా భావిస్తున్నారు. సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న నేత అరెస్ట్ కావడంతో సంస్థ నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బేస్రాపై పోలీసుల రివార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

1985లోనే వలంటీర్‌గా ..

బెస్రా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. హిందీ, సంతాలి, హో భాషల్లో మాట్లాడగలడు విద్యార్థి దశలోనే అప్పటి మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ (ఎంసీసీ) నేత ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌ దాతో బెస్రాకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భావజాలానికి ప్రభావితుడై సంస్థ సమావేశాలకు హాజరయ్యేవాడని పేర్కొన్నారు. 1985లో ధన్‌బాద్‌లోని సింద్రీలో జరిగిన సమావేశంలో వలంటీర్‌గా పనిచేసిన బెస్రా 1986లో ఎంసీసీలో ప్రాథమిక సభ్యత్వం పొందినట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. 1990లో సంస్థ ప్రచార కార్యక్రమాలు, కోల్‌కతా ప్రాంత కార్యకలాపాల బాధ్యతలు అతడికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. 1992లో ఝార్ఖండ్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాంచీ, పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు నెట్‌వర్క్‌ విస్తరణలో బెస్రా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. 1997లో దక్షిణ ఛోటానాగ్‌పూర్‌ కమిటీ ఏర్పాటు, 2000లో ఝార్ఖండ్‌ ప్రాంతీయ కమిటీ ఏర్పాటులో అతడి పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. 2003లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితుడైన బెస్రా 2004లో ఎంసీసీ, పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ విలీనం తర్వాత ఏర్పడిన సీపీఐ (మావోయిస్టు)లో మరింత కీలక స్థానానికి ఎదిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.మిసిర్‌ బేస్రా చాలా కాలం పాటు మావోయిస్టు సంస్థ వ్యూహాలు రూపొందించే నాయకుల్లో ఒకరిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఝార్ఖండ్‌లోని కోల్హాన్‌, సారండా అటవీ ప్రాంతాల్లో పనిచేసే మావోయిస్టు దళాలను అతడు పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. జరైకేలా, చిన్నానాగ్రా, మనోహర్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో అతడి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మావోయిస్టు సంస్థకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో కూడా బెస్రా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి లెవీ వసూళ్ల వ్యవహారాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసు ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.

బెస్రాపై 141 క్రిమినల్‌ కేసులు

మిసిర్‌ బెస్రాపై 141 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీటిలో హత్యలు, హత్యకు కుట్రలు, పోలీసులపై దాడులు, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధ చట్టం, యూఏపీఏ, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలోని గోయిల్‌కేరా పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యధికంగా 39 కేసులు నమోదయ్యాయి. టోంటో పోలీస్‌ స్టేషన్‌లో 29, చిన్నానాగ్రా, జరైకేలా స్టేషన్లలో చెరో 16 కేసులు, ముఫస్సిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో 11 కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న మిసిర్‌ బెస్రా, ఝార్ఖండ్‌ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలకు అత్యంత కీలకమైన మోస్ట్‌ వాంటెడ్‌ నేతల్లో ఒకరిగా ఉన్నాడు. అంతేకాకుండా దేశంలో అత్యధిక రివార్డు కలిగిన అగ్రనేతల్లో ఒకరిగా కూడా ఉన్నాడు. సైనిక వ్యూహాలు, దళాల నిర్వహణ, కొత్త క్యాడర్ల నియామకంలో అతడి పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. సారండా-కోల్హాన్‌ అడవుల్లో పోలీసులు, సీఆర్పీఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంపై జరిగిన పలు దాడులు, హత్యలు, పేలుళ్ల కేసులతో అతడి పేరు ముడిపడి ఉందని అధికారులు తెలిపారు. తాజాగా అతడి అరెస్ట్‌తో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *