– నాలుగు బోగీలు అగ్నికి ఆహుతి
– ప్రయాణికులంతా క్షేమం
న్యూదిల్లీ, నవంబర్ 6 : పంజాబ్‌లో అమృత్‌సర్-న్యూ జల్‌పైగురి కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12508)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పటియాలా జిల్లా సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయానికి లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేయడం, ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంజిన్ నుంచి ఐదో బోగీలో మొదట మంటలు చెలరేగగా అవి వేగంగా పక్కనే ఉన్న ఇతర కోచ్‌లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక బోగీలోని ఫ్యాన్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్యాంట్రీ కార్ నుంచి కూడా మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, అత్యవసర వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను మిగిలిన బోగీల నుండి వేరు చేశారు. రైలులోని ప్రయాణికులను స్థానిక పరిపాలన విభాగం వాహనాల ద్వారా రాజ్‌పురా రైల్వే స్టేషన్‌కు తరలించగా అక్కడనుండి వారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ రైలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి ఉన్నతస్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





