– భక్తులకు అన్ని వసతులు కల్పించాలి
– అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 6 : గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొలుత పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి తదితర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటికే పూర్తయిన, ఇంకా ప్రారంభం కావాల్సినవి, వివిధ దశల్లో కొనసాగుతున్న పనులపై సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఎం.హనుమంతరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్లతోపాటు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులు, వివిధ విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యమైనవని, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదారులు, పుష్కర ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్తు, వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను సమగ్రంగా కల్పించాలని సూచించారు. పుష్కరాల పనుల్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, దేవాదాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఒక శాఖ పనుల వల్ల మరో శాఖ పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
పనుల నాణ్యతలో రాజీ వద్దు
ప్రతీ పనికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, ఇంకా ప్రారంభం కావాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం, పూర్తి చేయాల్సిన గడువులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తరచూ పర్యటిస్తూ పనుల నాణ్యతను పరిశీలించాలని, కాంట్రాక్టర్లు నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేకించి పుష్కర ఘాట్లలో భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాల రూపకల్పనపై దృష్టి సారించాలన్నారు. పుష్కరాల సమయంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, నది పరిశుభ్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సూచించారు.
ధర్మపురి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ధర్మపురి ప్రాంతంలో సుమారు రూ.226 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలో భాగంగా పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు కొనసాగుతున్నాయి. ధర్మపురిలో సుమారు 470 మీటర్ల మేర కొత్త స్నాన ఘాట్ల అభివృద్ధి కూడా ప్రతిపాదిత పనుల్లో ఉంది. జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగáనున్న నేపథ్యంలో ఆలోగా అన్ని శాశ్వత, తాత్కాలిక పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





