అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం

వరంగల్‌ వాణి తేది: 22-4-1986 

ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. 

అగ్రరాజ్యాల ఆయుధపోటీ- కుమ్ములాటలో ఇప్పుడీ విధంగా పాకిస్తాన్‌ ప్రవేశించినట్లే. అఫ్గనిస్తాన్‌లో రష్యా తన 85 వేల సైన్యాలను నిల్పింది. కనుక ఎప్పుడే వేళ ఆ సైన్యాల్ని పాకిస్తాన్‌ మీదకు దండెత్తిస్తుందోనని పాకిస్తాన్‌ భయపడుతున్నదనుకోవాలి.  ఇజ్రాయిల్‌ను సృష్టించి సర్వశక్తి వంతమైన సైనిక దేశంగా దాన్ని పెంచి పోషిస్తూ ఆ ప్రాంత దేశాలతో ఆశాంతిని రావణకాష్ఠంగా మార్చిన ఎత్తుగడే ఇప్పుడు భారత ఉపఖండంలో కూడ అమెరికా అమలుకు తెస్తున్నదనటం అసంబద్ధం కాజాలదు. 

అఫ్గనిస్తాన్‌లోని కీలుబొమ్మ ప్రభుత్వానికి అండగా వచ్చిన రష్యా సైన్యాలు. ఏ క్షణాననైనా పాకిస్తాన్‌లోకి గెరిల్లాలను వేటాడే నెపంతో ప్రవేశించవచ్చు. కనుక తాను శక్తివంతంగా ఉండాలన్నది, పాకిస్తాన్‌ కోరిక. పాకిస్తాన్‌ను కబళించి అరేబియా సముద్ర తీరాన్ని చేజిక్కించుకొనే అవకాశం రష్యాకు ఇవ్వరాదనేది అమెరికా కోరిక కావచ్చు. 

ఒక వేళ రష్యా అట్లా చేస్తే అమెరికా ఇస్తున్న ఈ ఆయుధ సహకారంతో పాకిస్తాన్‌ నిలద్రొక్కుకుంటుందా? రష్యా ఆ మార్గం అనుసరించకపోతే అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్న ఈ అత్యంతాధునిక ఆయుధాలు, విమానాలు క్షిపణులు వగైరాలను పాకిస్తాన్‌ ఏంచేస్తుంది అన్నది కాలం మాత్రమే నిరూపించే పరిణామాలు.

రష్యా నుంచి ఇప్పటికే భారతదేశం సంపాదించిన ఆధునిక యుద్ధ సామగ్రితో పోల్చి చూపినా భారత సైనిక శక్తి భౌగోళికత వగైరాలను పరిశీలించినా పాకిస్తాన్‌ భారత్‌ సమఉజ్జీ కాజాలదు అనేది అమెరికావారి అభిప్రాయం.  ఇది నిజమే అనుకున్నప్పటికీ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్‌కు చేస్తున్న సహాయం వల్ల ఈ వ్యత్యాసం తలక్రిందవుతుంది. ఆ వ్యత్యాసాన్ని నిలుపుకొనుటకై భారత్‌ కూడ స్వశక్తిని పెంచుకోడానికి కృషి ప్రారంభించక తప్పదు. అంటే పాకిస్తాన్ – భారత్‌లు ఆయుధ పోటీలకు దిగాలన్న మాట.

తిండిగల వాడికి అజీర్ణబాధ 

తిండిలేని వారికి ఆకలి బాధ అయితే తిండిగల వాడికి అజీర్ణబాధ అన్నట్లు ఈ స్వయం సమృద్ధ సంపన్న దేశాలు వ్యవహరిస్తుండటం అసూనుషం రాక్షసం. 

ఈ అగ్ర రాజ్యాలు చిన్న దేశాల మధ్య కైలాటకాలు సృష్టించి చెరో వైపు చేరి ఆయుధాలు సరఫరా చేయటం, ఆయుధాల గర్వంతో యుద్ధోన్మాదులను చేయటం రెంటినీ నిర్వీర్యం చేయటం జరుగుతున్న కధలు చరిత్రలో కోకొల్లలు. అయినా వారి ఈ ఎత్తుగడలను ఆటకట్టించే మార్గంలేదు. అందుకు పూనుకొనవలసిన వర్ధమాన దేశాలు పరస్పరం కీచులాడుకొని పరోక్షంగా యుద్ధమదాంధులకు తోడ్పడుతుండటం ప్రపంచ ప్రజల దురదృష్టం. 

చేతితో ఆయుధాలు శక్తివంతమైన ఆయుధాలు ఉన్న ఏ చిట్టిపొట్టి దేశమైనా సరే మదించి దురహంకార దురాక్రమణ. చర్యలకు తలపడక మానదు. పాకిస్తాన్‌ ఈ ఆయుధాల సేకరణ పర్యవసానంగా ఇదివరకే దానిలో జీర్ణించుకొని వున్న అమానుష కాలుష్యం రాక్షస మదాంధతకు దారిని పెంచక మానదు. 

గత కాలంలో ఇట్లాంటి పరిణామంపల్ల భారతదేశంపై దండెత్తిన విషయం ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్‌కు కూడ తెలుసు. సైనిక నియంత నిరంకుశ పాలనలో పాశవికశక్తుల విజృంభణకు బలి అవుతున్న పాకిస్తాన్‌ ప్రజలు ఈ వినాశకర పరిణామాలకు చరమగీతం పాడితే తప్ప చరిత్రగతి మారదు. 

శాంతి కాముకులైన భారతీయులు – శాంతినికోరే ప్రపంచంలోని ఇతర వర్ధ మాన దేశాలు సమిష్టిగా వ్యవహరించి అగ్రరాజ్యాల ప్రజావ్యతిరేక విధానాలనూ, స్వయం వ్యక్తిత్వంలేని వారిని సాయుధం చేసి వారిలో శక్తివంతులమన్న భావన ప్రేరే పించి యుద్ధోన్మాదుల చేసే వారి రాజనీతిని ఎలుగెత్తి ఖండించుట ఎందుకు జరగటంలేదో? 

విశ్లేషణ, విమర్శః

యుద్ధమదాంధులు యుద్ధోన్మాదానికి సిద్ధం.

యం యస్ ఆచార్య 1986 ఏప్రిల్‌ 22న రాసిన ఈ ఘాటైన సంపాదకీయంలో రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది – అగ్రరాజ్యాల ఆయుధ రాజకీయాలు ప్రపంచ శాంతిని ఎలా ప్రమాదంలోకి నెడుతున్నాయన్నది. ముఖ్యంగా అమెరికా పాకిస్తాన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం ద్వారా భారత ఉపఖండంలో ఆయుధ పోటీని రెచ్చగొడుతోందని ఆచార్య గారు హెచ్చరించారు. రెండవది – ప్రజాస్వామ్య బాధ్యతలేని సైనిక నియంతృత్వాలకు అగ్రరాజ్యాలు ఆయుధ సహాయం చేస్తే, అవి దురహంకారంతో పొరుగుదేశాలపై దాడులకు, యుద్ధోన్మాదానికి దారితీస్తాయని ఆచార్య తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని సైనిక పాలన, అమెరికా వ్యూహం, రష్యా-అఫ్గనిస్తాన్‌ యుద్ధం మధ్య చిక్కుకున్న ప్రపంచ రాజకీయాలను ఆయన అత్యంత కఠినమైన, ఘాటైన భాషలో విశ్లేషించారు.

పాకిస్తాన్ కు సాయుధం చేయడమేనా పని

1986లో రాసిన ఈ సంపాదకీయాన్ని నేడు చదివితే, అది కేవలం ఒక కాలానుగుణ రాజకీయ వ్యాఖ్య కాదు; భవిష్యత్తును ముందుగానే చూచిన దూరదృష్టి గల హెచ్చరికగా అనిపిస్తుంది. అప్పట్లో ప్రపంచం అమెరికా-సోవియట్‌ Cold War శీతయుద్ధ ద్వంద్వంలో చిక్కుకొని ఉండేది. అఫ్గనిస్తాన్‌లో సోవియట్‌ సైన్యం ప్రవేశం, దానికి ప్రతిగా అమెరికా పాకిస్తాన్‌ను సాయుధం చేయడం, దక్షిణాసియాను ఆయుధ రాజకీయాల కేంద్రంగా మార్చింది. ఆచార్య గారు అదే సమయంలో ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు – ఈ ఆయుధాలు చివరికి ఎవరిమీద ప్రయోగించబడతాయి?” అని. చరిత్ర ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్‌కు అందించిన సైనిక శక్తి తర్వాత భారతదేశంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధాలకు, సరిహద్దు ఉగ్రవాదానికి, కాశ్మీర్‌ అస్థిరతకు, కార్గిల్‌ వంటి సంఘటనలకు బలమైంది.

ఆయుధ – యుద్ధం అంతా వ్యాపారమే

నేడు ప్రపంచ పరిస్థితులు మారినా, సమస్యల స్వరూపం మాత్రం చాలా వరకు అదే ఉంది. అప్పట్లో అమెరికా-సోవియట్‌ పోటీ ఉంటే, ఇప్పుడు అమెరికా-చైనా వ్యూహాత్మక పోటీ ప్రపంచాన్ని మళ్లీ రెండు ధ్రువాల వైపు నెడుతోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇజ్రాయిల్‌-గాజా ఘర్షణ, దక్షిణ చైనా సముద్ర వివాదాలు, తైవాన్‌ ఉద్రిక్తతలు – ఇవన్నీ ఆయుధ వ్యాపారం, వ్యూహాత్మక మిత్రబంధాలు, భౌగోళిక ఆధిపత్య పోరాటాల చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పట్లో పాకిస్తాన్‌ను అగ్రరాజ్యాలు సాయుధం చేస్తే, నేడు అనేక దేశాలు ప్రాక్సీ యుద్ధాల వేదికలుగా మారుతున్నాయి.

“తిండిగల వాడికి అజీర్ణబాధ” 

ఆచార్య గారు “తిండిగల వాడికి అజీర్ణబాధ” అన్న ఉపమానంతో ధనిక దేశాల యుద్ధ వ్యాపారాన్ని ఎండగట్టారు. అది నేటికీ అక్షర సత్యమే. ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఆకలి, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, అగ్రరాజ్యాలు లక్షల కోట్ల డాలర్లను ఆయుధాల తయారీలో ఖర్చు చేస్తున్నాయి. యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దుల మధ్య కాదు; ఆయుధ మార్కెట్ల మధ్య పోటీగా మారింది. ఒక దేశంలో ఉద్రిక్తత పెరిగితే, ఆయుధ కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. శాంతి కన్నా యుద్ధమే కొందరికి వ్యాపారంగా మారింది.

1986లో ఆచార్య గారు హెచ్చరించిన మరో ముఖ్య అంశం-  “చిన్న దేశాలను ఆయుధాలతో మదింపజేస్తే అవి దురాక్రమణకు దిగుతాయి” అన్నది. నేడు కూడా ఇదే వాస్తవం. అణ్వాయుధాలు, డ్రోన్లు, సైబర్‌ యుద్ధ పరికరాలు, కృత్రిమ మేధస్సుతో పనిచేసే సైనిక వ్యవస్థలు ప్రపంచాన్ని మరింత ప్రమాదకర దిశగా తీసుకు పోతున్నాయి. ఒకప్పుడు యుద్ధానికి సైన్యాలు అవసరమైతే, ఇప్పుడు డ్రోన్‌ దాడులు, సైబర్‌ దాడులు, డిజిటల్‌ గూఢచర్యం ద్వారా దేశాలను అస్థిరం చేయగల పరిస్థితి ఏర్పడింది.

శాంతి రాజకీయాల పట్ల నిబద్ధత

ఆచార్య గారి రచనలో కనిపించే మరో గొప్ప విశేషం, ఆయన శాంతి రాజకీయాల పట్ల నిబద్ధత. ఆచార్య  కేవలం అమెరికా వ్యతిరేకతతో మాట్లాడలేదు; అగ్రరాజ్యాల ప్రజావ్యతిరేక విధానాలను, ఆయుధ రాజకీయం వల్ల మానవ సమాజానికి కలిగే ప్రమాదాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని వర్ధమాన దేశాలు ఐక్యంగా నిలబడి యుద్ధ రాజకీయాలను వ్యతిరేకించాలన్న పిలుపు ఇచ్చారు. కానీ నేడు కూడా చిన్న దేశాలు అగ్రరాజ్యాల శిబిరాలుగా విడిపోయి, పరస్పర అనుమానాలతోనే కొనసాగుతున్నాయి.

“అసమర్ధుని దుర్మద విజృంభణ” అనే పదబంధం 

ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలు పెరిగినా, మానవ సమాజం ఇప్పటికీ యుద్ధ భయాల నుంచీ పూర్తిగా బయటపడలేదు. 1986లో ఆచార్య గారు పేర్కొన్న “అసమర్ధుని దుర్మద విజృంభణ” అనే పదబంధం నేడు కూడా అనేక దేశాల రాజకీయ నాయకత్వాలకు వర్తిస్తుంది. అధికారం, ఆయుధాలు, మతం, జాత్యహంకారం — ఇవన్నీ కలిసినప్పుడు ప్రపంచ శాంతి ఎంత సులభంగా ప్రమాదంలో పడుతుందో ఆయన ముందుగానే గ్రహించారు.

అందుకే ఈ సంపాదకీయాన్ని కేవలం చరిత్ర పుటల్లో నిలిచిపోయిన పాత రచనగా చూడలేం. ఇది నేటి ప్రపంచ రాజకీయాలకు కూడా అద్దం పట్టే విశ్లేషణ. యుద్ధం ద్వారా శాంతి రాదని, ఆయుధ పోటీ చివరికి ప్రజలనే బలి తీసుకుంటుందని, అగ్రరాజ్యాల వ్యూహాలకు బలవుతున్నది సాధారణ మానవ సమాజమేనని ఆచార్య గారి హెచ్చరిక ఇప్పటికీ అంతే ప్రస్తుత సమస్య అని నిలిచివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *