– నాయకత్వ మార్పుపై ఊహాగానాలే
– రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించాం
– కర్నాటకంపై పెద్దల సమావేశం.. వేణుగోపాల్ వివరణ
న్యూఢిల్లీ, మే 26: కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని కేసీ వేణుగోపాల్ అన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగినట్టు చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ సమావేశంలో కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశాలే చర్చించాం. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాం’ అని చెప్పారు. ఇతర రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి కూడా రాజ్యసభ సీట్ల ఎన్నికలను ప్రకటించారని, దానిపైనే ఈరోజు చర్చించామని, తక్కినవన్నీ ఊహాగానాలేనని అన్నారు. కాంగ్రెస్ 2023లో కర్ణాటకలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివకుమార్‌కు పదోన్నతిపై పలుమార్లు ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయిదేళ్లూ తాను అధికారంలో ఉంటానని, అయితే పార్టీ నిర్ణయానికి తాను, శివకుమార్ కట్టుబడి ఉంటామని పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకేలను దిల్లీకి రమ్మని పార్టీ అగ్రనాయకత్వం పిలవడంతో నాయకత్వ మార్పిడి అంశం మరోసారి ప్రచారంలోకి వచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





