– కేంద్రం తాజా అంచనాలు
న్యూదిల్లీ, జూన్ 26 : ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ట్రాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల్లాల్లో 25 శాతం కంటే తక్కువ సాగునీటి వసతి కలిగిన 111 జిల్లాలను అత్యంత ప్రమాదకరమైన కేటగిరీగా గుర్తించారు. 25 నుంచి 50 శాతం లోపు సాగునీటి వసతి ఉన్న మరో 76 జిల్లాలను మధ్యస్థ ప్రమాదకర కేటగిరీలో చేర్చగా, 50 శాతం కంటే ఎక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న 128 జిల్లాలను సాపేక్షంగా తక్కువ ముప్పు ఉన్న ప్రాంతాలుగా పరిగణించారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జిల్లాలు ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కేంద్రీకృతమై ఉన్నాయి. మిగిలిన జిల్లాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నాయి. బలహీనమైన రుతుపవనాల ప్రభావాన్ని తట్టుకునేందుకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. పంటల వైవిధ్యం, తేమ సంరక్షణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యం వంటి వ్యూహాలను అనుసరించాలని తెలిపింది. చెరువుల మరమ్మతులు, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కాలువల్లో పూడికతీత, నీటి సంరక్షణ నిర్మాణాల విస్తరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని ఆదేశించింది. మరోవైపు 2026 ద్వితీయార్థంలో ఎల్ నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించింది. సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం అంచనాల ప్రకారం దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం మాత్రమే కురిసే అవకాశం ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎల్ నినో వల్ల అనావృష్టి ఏర్పడి ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





