ఒక తరం నడిచిన నడక 

“మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను భుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం పుస్తకపుపుటల్లో నిశ్శబ్దంగా పడుకునే పద్యం కాదు. అది నిద్రలేని రాత్రి, మెలకువ కలిగిన  రహదారి. ఆయన కవితలో అలంకారం లేదు ఆకలితో ఉన్నవాడికి అలంకారం అవసరం లేదు కదా. అక్కడ ఉన్నది చెదిరిపోయిన జీవితం, మోసపోయిన శ్రమ, నడిచే ఆశ..”

కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత మనకు కేవలం సమాచారం దొరకదు. మనలో నిద్రపోయిన జ్ఞాపకం మేలుకుంటుంది. వివి గారి ‘సహచరులు’ అలాంటి పుస్తకం. ఇది జీవితకథ కాదు. ఇది ఒకవ్యక్తి నడిచిన దారి కాదు. ఇది ఒకకాలం తన గాయాలను తనే చెప్పుకున్న కథ. జైలుగోడల మధ్య కాలం ఆగిపోతుంది అనుకుంటాం. కానీ ఈ పుస్తకంలో కాలమే ఎక్కువగా నడుస్తుంది. ఒక్క అడుగు ముందుకికాదు లోపలికి మనిషి అంతరాల్లోకి.

వరవరరావు రచనలో కరుణ ఎక్కడా బిగ్గరగా అరవదు. కోపం హింసగా మారదు. అది ఒక నిర్ధారణలా ఉంటుంది. ఇక్కడ సాహిత్యం ఒట్టి అలంకారం కాదు అది జ్ఞాపకాల కేంద్రం. దాన్ని మరిచిపోకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం. ఎందుకంటే మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను బుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం పుస్తకపుపుటల్లో నిశ్శబ్దంగా పడుకునే పద్యంకాదు. అది నిద్రలేని రాత్రి, మెలకువ కలిగిన  రహదారి. ఆయన కవితలో అలంకారం లేదు ఆకలితో ఉన్నవాడికి అలంకారం అవసరం లేదు కదా. అక్కడ ఉన్నది చెదిరిపోయిన జీవితం, మోసపోయిన శ్రమ, నడిచే ఆశ.

వివి పదాలు ఎప్పుడూ పూలుకావు. గాయాల వరుస. నిద్రపోతున్న సమాజాన్ని అలారం మోగించినట్టే లేపుతాయి. పేదవాడి గొంతు అతని కవితలో వ్యాకరణం నేర్చుకోదు. ఇక్కడ ప్రేమ కూడా పువ్వుల్లా కాదు. ప్రేమ అంటే సహచరుడి భుజం మీద వేసిన చేయి. జైలుగోడ మీద రాసిన అక్షరం. జైలుగోడలు అనగానే మళయాళ రచయిత వైక్కం మహమద్ బషీర్ రాసిన ‘ మధిలుకల్’ కథ గుర్తొస్తుంది. ఆ కథ ఆధారంగా అదూర్ గోపాలకృష్ణన్ తీసిన సినిమా అందులో మమ్ముట్టీ గుర్తొస్తారు. సహచరులులో వివి కేవలం ప్రశ్నిస్తాడు. వివి రచనల్లో ప్రశ్నించని కవిత కవితే కాదు. ఆయన కవిత్వంలో వ్యక్తిగత వేదన సామూహిక గాయంగా ధ్వనిస్తుంది. అందుకే వివి కవిత చదవడం అంటే కేవలం సాహిత్యానుభవం కాదు. అది  బాధ్యత. కవిత రాయడంతోటే ముగియదు. అది మనలో మొదలవుతుంది.

వరవరరావు రచించిన ‘సహచరులు’ కేవలం వ్యక్తిగత స్మృతుల సంకలనం కాదు. అది ఉద్యమకాలపు సజీవచరిత్ర, ఒకతరం చేసిన ప్రతిఘటనల మానవహారం. ఈ పుస్తకంలో కనిపించే సహచరులు వ్యక్తులు కాదు వాళ్ళు ఒక కాలానికి ప్రతీకలు, ఒక రాజకీయ సాంస్కృతిక చైతన్యానికి రూపాలు. ‘సహచరులు’ ఉద్యమంలో కలిసి నడిచిన వ్యక్తులపట్ల కవి వివికి ఉన్న భావోద్వేగ రాజకీయ బాధ్యతగా ఈ రచన చేసారు. ప్రతి సహచరున్ని పరిచయం చేస్తూ వరవరరావు వారి వ్యక్తిగత జీవితానికంటే వారి రాజకీయ స్థితి, సామాజికపాత్ర, త్యాగాలపై దృష్టి పెడతాడు. ఈ పుస్తకంలో ‘సహచరుడు’ అంటే స్నేహితుడు కాదు.

అతడు ఒకేకలను నమ్మినవాడు ఒకే ప్రమాదాన్ని పంచుకున్నవాడు ఒకే నిర్బంధాన్ని భరించినవాడు అందుకే ఈ సహచరులు వ్యక్తిగత జ్ఞాపకాలుగా కాకుండా సామూహిక చైతన్యంగా మారతారు.

వరవరరావు భాష ఇక్కడ కూడా అలంకారాలకన్నా నిజాయితీకి, ఆగ్రహం కన్నా ఆవేదనకు స్థానం ఇస్తుంది. ఆయన ఎవరినీ మహోన్నతులుగా చిత్రించడు. వారి బలహీనతల్ని కూడా దాచడు. అదే ఈ పుస్తకానికి గొప్ప విశ్వసనీయత. సహచరులు చదివితే స్పష్టంగా అర్థమయ్యేది ఉద్యమం అంటే కేవలం నినాదాల సమాహారం కాదు అది మానవ సంబంధాలల్లో సంక్లిష్టత, విరోధాలు, విభేదాలు, విరామాలు ఉన్నప్పటికీ లక్ష్యంపై నిలబడే నిబద్ధత అని తెలుస్తుంది. ‘సహచరులు’ చదివిన తర్వాత ఈ దేశంలో అనేక ఉద్యమాల చరిత్రను వ్యక్తులపేర్లతో కాదు, వారి త్యాగాలతో కొలవాలి అన్నభావన కలుగుతుంది. వరవరరావు రచనల్లోనిది అరిచే భాషకాదు. అది జైలుగోడమీద పడిన నీడలాంటిది. ఎవరూ పట్టించుకోని పాతగాయం లాంటిది. ఆయన తనవాక్యాలతో అలరించడు. అలంకరించడు. ఆయన వాక్యాలను రాసి నిజానికి వదిలేస్తాడు. అందుకే చదువుతున్నప్పుడు కొన్నిచోట్ల మనం చదవడం ఆపి నిశ్శబ్దంగా కూర్చోవాలి. నేను అదే చేసాను.

ఈ పుస్తకం చదవడం ముగిసిన తర్వాత ముగిసింది అనిపించదు. మన ఆలోచనలో మనసులో నడకలో కొంతభారం పెరుగుతుంది. మన మౌనంలోకి కొంత చరిత్ర చేరుతుంది. అప్పుడే అర్థమవుతుంది ఈ పుస్తకం సహచరుల గురించి కాదు. మన గురించే అని. మన అందరి గురించీ అని. మనమెంతవరకు మనకాలానికి సహచరులుగా నిలబడ్డామో అన్నదే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సామాజికంగా ఇది కవితాత్మక చరిత్ర.

-వారాల ఆనంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *