శతకాలకే మకుటం అప్పాజోస్యుల ‘సుగుణాఢ్య శతకం’

ఒక్కొక్క శతకపద్యం ఒక్కోరీతిలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తుండటం అప్పాజోస్యుల శతకనిర్మాణ కౌశలం. ‘శతమును మించి సూర్యులును చంద్రులు నంతకుమించి మిన్నునం దతి రథులౌచు దీప్తకిరణాలి వసుంధర జిమ్మవచ్చు, త ద్ద్యుతి యిసుమంత లో నిరుల ద్రోలదు, సూరి వచో మరీచి హృ ద్గతమయి పూన్చులో వెలుగు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్’ పద్యంలో అనేకమంది సూర్యులు, చంద్రులు మింటనుంచి సమస్తలోకములకు వెలుగులునింపగల యోధులు.

‘పలుకుల తల్లి! నీవెయగు వాక్కుల నిన్ను నుతింపబూనుటా, కలనములేక తోయముల కంధికి తర్పణమట్లు, చిన్నదివ్వెలు సమకూర్చి హారతులు విన్ను వెలుంగునకిచ్చునట్లు, ధీ నిలయమ! స్వీకరింపగదే నీవగు శ్రీ సుగుణాఢ్య సూక్తముల్’ అని చదువులతల్లి భారతిని స్తుతిస్తూ శతక రచనకుద్యుక్తుడయ్యారు అప్పాజోస్యుల సత్యనారాయణ.

       కవులకు ఏడు లక్షణాలుండాలని లాక్షణికులు పేర్కొన్నారు. కవి వివేకి, వాచకుడు, రౌచికుడు, ఆర్థికుడు, శిల్పకుడు, భూషణార్ధి, మార్గవానుగతుడు-అయిఉండాలని లాక్షణికుల నిర్దేశం. ‘కవిత రససిద్ధులు, ప్రసిద్ధులు అయిన విద్వత్కవి కావడం చేత అప్పాజోస్యుల కైక పొత్తాల గురించి చెప్పేవి ఎన్నో ఉంటాయి. కనుక వ్యాఖ్యాన అవసరం ఉంది’ అంటారు సన్నిధానం నరసింహశర్మ. ప్రార్ధనా పద్యాలతో శతకరచనకుపక్రమించడం గతంలోనూ ఉంది. భర్త్రుహరి త్రిశతకం, భద్రాచల రామదాసు-దాశరథి శతకం, ధూర్జటి-కాళహస్తీశ్వర శతకం ఈ కోవకు చెందినవే. ఈ పధ్ధతి అనుసరించడం ద్వారా అప్పాజోస్యుల వారినే ఆదర్శంగా తీసుకొన్నట్లు తెలుస్తుంది. ఈ శతకానికి ముందుపంక్తి రాసిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘సుగుణాఢ్య శతకం’కు ఆధారం ఆదిశంకర విరచితమైన ‘వివేకచూడామణి’గా భావించారు. అప్పాజోస్యుల ప్రథమపద్యం ‘శ్రీ విధిసూత్రమై సకలచేతన కారణమై సదాతన స్థావర జంగమస్థితికి తావలమై గుణదోషలుప్త సంభావిత విశ్వతోముఖ విభాకరమై నిఖిలాత్మమై జగద్వ్యావృత శక్తి తావెలుగు తాదృశముల్ సుగుణాఢ్య వర్తనల్’ చదివినమీదట వారికి ‘వివేక చూడామణి’లో ఆదిశంకరులు రాసిన ‘యేన విశ్వమిదం వ్యాప్తం యన్న వ్యాప్నోతి కించన, అభారూప మిదం సర్వం యం భామ్త మనుభాత్యయం’ అనే శ్లోకం గుర్తుకు వచ్చింది. దీనినే అప్పాజోస్యుల ‘సకలచేతన కారణమై’, ‘నిఖిలాత్మమై జగద్వ్యావృతశక్తి తావెలుగ’ని సంబోధించారని ఆచార్య అనుమాండ్ల భూమయ్య విశ్లేషించారు.

       ‘సుగుణాఢ్య శతకం బహు విషయసమ్మిశ్రణం. మనిషి మనీషిగా పరిణమించే జీవనక్రమాన్ని ధ్వనిపూర్వకంగా బోధించిన ఈ శతకం ఒక విశాల రత్నాకరం’ అని వ్యాఖ్యానించారు ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి. సాధారణంగా శతకాలన్నీ ఏకశైలి మనోహరత్వం కలిగిఉంటాయి. ఉదాహరణకు వేమన శతకం చాలు. ఈ ఏకశైలి మనోహరత్వాన్ని పుక్కిటపట్టినవారు చాలామంది తరువాతికాలంలో వేమన పేరుమీదనే అనేకపద్యాలు సృజించి, తమభావాలను వేమనశతకం ‘వినుర వేమ’ పేరున చలాయించారని చరిత్ర చెబుతుంది. నిజానికి అప్పాజోస్యుల మహాకవి అన్నది ఆయన ప్రౌఢశైలిలో రాసిన ఏడు వృత్త తారావళులు చదివినవారెవరైనా గ్రహిస్తారు.

        మహాదేవి మత్తేభవృత్త తారావళి, దివాకర వృత్త తారావళి, సుజల వృత్త తారావళి, పావక వృత్త తారావళి, సమీర వృత్త తారావళి, అంతరిక్ష వృత్త తారావళి, పృధివీ వృత్త తారావళి అని మొత్తం ఏడు తారావళులు రాశారు. ఇందులో చివరి అయిదు పంచభూతాలకు చెందినవి. అందువలన ఆ అయిదింటినీ కలిపి ‘పంచవటి’ అని వ్య్వవహరించారు అప్పాజోస్యుల. ఈ ‘తారావళులు’ ఏమిటి? గతంలో ఈ ప్రక్రియను ఎవరైనా సాహిత్యంలో వినియోగించారా- వంటివి వేరే వేదికపైన చర్చించవలసిన విషయాలు.

        ఆయన తెనాలిమండలం వారు. చిన్ననాడే సంప్రదాయ ఛందో వ్యాకరణాదులను, మహాభారత, భాగవత, రామాయణ, ఉపనిషత్తులను పఠించినవారు. తల్లిదండ్రులకు అర్ధ, రాగయుక్తంగా పద్యం ఆలపించటం నేర్చినవారు, ఆ నాటి పద్యనాటక ప్రయోక్తల పద్యబాణీలను నేటికీ తలుచుకొంటారు. ఉత్తరోత్రా పైచదువులకు, ఆమెరికా వెళ్లినా ఆయన సంప్రదాయ తెలుగు అధ్యయనం, తెలుగుభాషా ప్రచార ప్రోత్సాహం వీడలేదు. వృత్తిరీత్యా భౌతిక శాస్త్రవేత్త. భౌతికశాస్త్ర అంతర్భాగమైన కంప్యూటర్ విభాగంలో ఆచార్యులుగా పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసి, ప్రపంచం మెచ్చే భౌతికశాస్త్ర పరిశోధకులైనారు. వీరిని ‘గూగుల్ స్కాలర్’గా, ‘ఇంటర్నేషనల్ వెబ్ అఫ్ సైన్స్ స్కాలర్’గా అంతర్జాలంలో దర్శించవచ్చు. అయితే భౌతిక శాస్త్రవేత్తగా వీరు అంతరిక్ష శోధన కూడ క్షుణ్ణంగా ఎరిగినవారు. అంతరిక్ష నిర్మాణం, విశ్వవ్యాకోచం, క్వాజార్ల, గెలాక్సీల ఉత్పత్తి, వాటినుంచి నక్షత్రాల వ్యుత్పత్తి, నక్షత్రాల మరణం, సూపర్నోవాల ఉద్భవం, అంతరిక్షంలో చీకటిబిలాలు, సౌరమండలం, భూమి, ఇతరగ్రహాల ఏర్పాటు వంటి అంశాలలో కొట్టినపిండి. అయితే వీటిని ఇంతవరకూ ‘పాపులర్ సైన్స్’ భాషలో, తెలుగులో చెప్పినవారున్నారు కానీ, పద్యరూపంలో పంచభూతాలను వృత్తతారావళులుగా చెప్పగలగడం ఒక్క అప్పాజోస్యులకే చెల్లింది.

        ‘తాదృశముల్ సుగుణాఢ్య వర్తనల్’ అనే మకుటంతో ఈ శతకరచన సాగింది. ఇందులో సుమారు 108 పద్యాలున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పలమాల, చంపకమాల వృత్తాలతో విరచితమైనాయి.  విశేష శాస్త్రీయ అనుభవం కలిగిన వారగుట చేత వీరు శతకనిర్మాణం విశిష్టపద్ధతిలో సాగుతుంది. అందరం చూసే ప్రకృతి ఒకటే. కానీ, మన అంతరంగంలో ఆ ప్రకృతి గురించిన అవగాహన వేరు, వేరురీతులలో మానవ నైతికవర్తనానికి ఉదాహరణై నిలుస్తుంది. గతంలో శతకాలు చిన్నచిన్న ప్రకృతిసహజ ఉదాహరణలతో నైతికతను ప్రేరేపించేవి. అదోశైలి. వీరిశైలి చూడండి. ‘గానము వీనులందే యిసుకన్ బడి వెంటనె యింకునీటి చందాన లయంబు నొందు కవిదర్శిత సూక్త విశేష సంగతుల్, మానసమందు నొత్తిగిలి మాటికి నిర్వృత్తి నందజేయు సంధానత నంతరంగమున తాదృశముల్ సుగుణాఢ్యావర్తనల్’ నీటిబిందువు ఇసుకలో పడినప్పుడు ఇంకిపోయినట్లుగా, సంగీతం భౌతికమైన శ్రవణేంద్రియాలలోనే లయం అయిపోతుంది. కానీ, కవి ప్రవచించిన సూక్తవిశేషాలు శ్రోత మనసులోకి ప్రవేశిస్తాయి. అంతరంగంలో అల్లుకొనిపోతాయి. వ్యక్తి సంస్కారంలో ఇమిడిపోతాయి. పదేపదే ఆనందమయమైన స్థితిని కలిగిస్తాయి. లోకంలో సుగుణసంపన్నుల వర్తనలు ఇటువంటివే.

        ‘తరువులు కల్పవృక్ష సమతాదృతి నొప్పు, జలంబులెల్ల నిర్జర నదీతీర్ధసిద్ధిని విరాజిలు నిర్మమచిత్త సంస్థితిన్, హరిహరమూర్తి తానేయని యాత్మనెరుంగు సుదీర్ఘదర్శి, కీ ధరణియె బ్రహ్మలోకమగు తాదృశముల్ సుగుణాఢ్యావర్తనల్’ అంటే ఆత్మజ్ఞాన సంపన్నులైన వారికి భువిపై ఉన్న వృక్షసమూహం అంతా కల్పవృక్ష సమమైన ఆదరణతో ఒప్పారుతాయి. జలం అంతా తీర్థగౌరవంతో సమాన గౌరవం కలిగి అలరారుతుంది. మమకార రహితమైన చిత్తసంస్థితి కలిగి ‘హరిహరమూర్తి తానే’ అనే సూక్ష్మదృష్టి కలవానికి ఇహలోకమే బ్రహ్మలోక సదృశం కదా! అని చెబుతున్నారు కవి.

           ఒక్కొక్క శతకపద్యం ఒక్కోరీతిలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తుండటం అప్పాజోస్యుల శతకనిర్మాణ కౌశలం. ‘శతమును మించి సూర్యులును చంద్రులు నంతకుమించి మిన్నునం దతి రథులౌచు దీప్తకిరణాలి వసుంధర జిమ్మవచ్చు, త ద్ద్యుతి యిసుమంత లో నిరుల ద్రోలదు, సూరి వచో మరీచి హృ ద్గతమయి పూన్చులో వెలుగు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్’ పద్యంలో అనేకమంది సూర్యులు, చంద్రులు మింటనుంచి సమస్తలోకములకు వెలుగులునింపగల యోధులు. దివాకర, నిశాకరులిరువురు అసంఖ్యాకంగా తమ వెలుగులను పుడమిపై ప్రసరింపచేసినా అవి బాహ్యచీకట్లను పారద్రోలి వెలుగులను ప్రసాదిస్తాయే కానీ, మనిషి అంతరంగంలోని చీకట్లను తరమలేవు. పండితుని వచోకిరణాలే మనిషికి అంతరమైన వెలుగులను కలిగిస్తాయి.

         ‘బుధుండెవ డిల నన్యు దోషముల నిగ్గి గుణంబుల నేన్ను వాడు మాధవుడు సమానసంస్కృతుడు’ అన్నా, ‘అమృతము మృత్యువున్ యుగళమై మనదేహమునందే నిష్టమై యమరి నివాసముండునని’ అన్నా వివేకవంతుల ప్రజ్ఞ ఎంతటి ఘనమైందో వివరిస్తున్నారు శతకకారుడు అప్పాజోస్యుల. అలాగే ‘పరజన కార్యసిద్ధికి నపార సహాయమునందజేసి సుస్థిరమతులై స్వకీయముల సేయరు చెన్నుగ సజ్జనుల్’ అని చెప్పటమేగాక, ఆచరణలో చూపెట్టినవారు ఈ శతకకారుడు.

        ఈ సుగుణాఢ్యా శతకంలో అప్పాజోస్యుల వారు ‘నిశ్చిత సంయమీంద్రులు వినీతులు గాంచు ననూన సిద్ధి నే దుశ్చర సాధనల్ గొనక’ అని) ఒక పద్యం రచించారు. దాని అర్ధమేమిటంటే ‘లోకంలో సంయమీంద్రులు జితేంద్రియులై, పరిపూర్ణమైన ఉత్తమ యోగస్థితిని పొందుతారు. నిరంతర కవితాసాధనమే తపోదీక్షగా గైకొని భావరస ప్రధానమైన మనో నిశ్చలతను కవి కూడ సాధించగలడు’-అని. ఈ మాటలు అప్పాజోస్యులవారికే సరిగ్గా నప్పుతాయన్నది ఈ శతక కవితా సంపుటిని చదివినవారందరూ నిర్ద్వందంగా అంగీకరించే విషయం.

-ఆచార్య డా కొప్పరపు నారాయణ మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *