– తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేశారు
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గుర్తు చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహం వద్ద సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బాపూజీ పోరాడారని, తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుల్లో ఒకరని కొనియాడారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, బలహీనవర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల స్థాపనలో ఆయన పాత్ర మరువలేనిది 
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్దంతి సందర్బంగా బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని, గ్రంథాలయాల స్థాపనలో వారి పాత్ర మరువలేనిదని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఆయన అసలు సిసలైన బీసీ వాది అన్నారు. కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ మాట్లాడుతూ బాపూజీ 1969లో ప్రసార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారన్నారు. మరో సభ్యుడు జయప్రకాష్ మాట్లాడుతూ చిన్న గ్రామం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. సభ్యురాలు బాలలక్ష్మి రంగు మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అన్నారు. కార్యక్రమంలో అసిస్టంట్ సెక్రటరీ ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ సతీష్ కుమార్, ఇర్ఫాన్ బిన్ ఖలీద్, రీసెర్చ్ అసోసియేట్ లక్ష్మీనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొని లక్ష్మణ్ బాపూజీకి పుష్పాంజలి ఘటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





