- ఫాసిజాన్ని కూల్చేందుకు మరో సైన్యం కావాలి
- వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సులో వక్తలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పాలకవర్గాల విధానాలతో దేశంలోని ప్రజలంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదికలో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అభ్యుదయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన ఆదివారం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల కూటమి సదస్సు విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన పలువురు మేధావులు మాట్లాడుతూ.. పాలకవర్గాలపై ప్రజలు అన్ని విధాల విసిగిపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధలతో ఉన్నారన్నారు. వామపక్ష ప్రజాతంత్ర వేదిక నాయకులు డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు సభ ఉద్దేశాన్ని స్వాగత ఉపన్యాసం చేశారు.
ఈ సభలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై బలమైన ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్య కార్యచరణ జరగాలన్నారు. గతాన్ని సమీక్షించుకొని, ప్రజా ఉద్యమాలు బలంగా చేస్తూ, ఎన్నికల్లో బడా పెట్టుబడిదారీ పాలకవర్గ పార్టీలకు దూరంగా బలమైన ప్రజా ప్రత్యామ్నాయని నిర్మించాలన్నారు.
ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదిగోని రవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా వైఫల్యం కానటువంటి కమ్యూనిస్టు ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాల ప్రత్యామ్నాయ కార్యాచరణ సాగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు అంగీకారానికి వచ్చి, బడా సంపన్న పాలక వర్గాలకు వ్యతిరేకమైన బలమైన ఎన్నికల ఫ్రంట్ నిర్మాణానికి పూనుకోవాలన్నారు.
కార్యాచరణ మొదలుపెట్టాలి : పరకాల ప్రభాకర్
సదస్సుకు హాజరైన ఆర్థిక నిపుణులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా చర్చలు, విశ్లేషణలు ఆపి కార్యచరణ మాత్రమే చేపట్టాలన్నారు. నరేంద్ర మోదీ పాలకులు ప్రజల మధ్య సంఘర్షణను సృష్టిస్తున్నాడని, పెట్టుబడిదారులు నియంతృత్వం, ఫాసిజంల ఐక్యతతో ముందుకు వెళుతుంటే కమ్యూనిస్టులు చీలుకలై వేరుపడ్డారన్నారు. ఫాసిజం నిర్మాణానికి ఒక సైన్యం ఉందని, దాన్ని కూల్చడానికి ఒక సైన్యం కావాలని అన్నారు. ప్రజల హక్కులు, కోర్టులు , రాజ్యాంగబద్ధ సంస్థలు అన్ని మూసుకుపోయాయని,మూసుకుపోనిది వీధి, వీధిలోని పోరాటం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ పోరాటాలు చేయడానికి లెఫ్టిస్టులందరూ ఐక్యం కావాలన్నారు.
సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ఒక బలమైన వామపక్ష ప్రజాతంత్ర కార్యచరణకై కృషి చేస్తామన్నారు. ఆ ప్రయత్నం ఇంకా విస్తృతంగా జరగాలని, కలిసి పనిచేద్దాం, కలిసి కృషి చేద్దాం అన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీవి చలపతిరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ఐక్యత తక్షణమే అవసరమన్నారు. 80 ఏళ్ల తర్వాత కూడా 80 కోట్ల మంది రేషన్ బియ్యంతో బతుకుతున్నారంటే దేశం ఎంత అభివృద్ధిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే కమ్యూనిస్టులు అందరూ ఐక్యంగా పోరాటాలకు పూనుకోవాలన్నారు. దీని కొరకు చర్చల ప్రక్రియ మొదలు కావాలన్నారు.
ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ ఆకలి, దారిద్రం, అసమానతలు పెరుగుతుంటే ఫాసిజం అంతే ప్రమాదకరస్థాయిలో పెరుగుతుందన్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తక్షణం ఐక్యంగా పోరాడాలన్నారు. ఒకరిని పులి తింటుంది. మోడీ అనే పులి నన్ను తినడం లేదు కదా అంటే నీ వంతు కూడా ఒకరోజు వస్తుందన్నారు. తనదాకా వచ్చేదాకా చూడకుండా బాధితుల తరఫున పోరాడాలన్నారు.
సిపిఐ ఎంఎల్ నాయకులు మోడం మల్లేశం మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజాతంత్ర శక్తులు ప్రజా సమస్యలపై తక్షణం ఐక్యంగా పోరాడాలి అన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై తక్షణం విస్తృతస్థాయి ఐక్య కార్యచరణ కొరకు కృషి చేయాలి అన్నారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఫ్రంట్ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ ఫాసిజం ప్రమాదం దేశంలో పెరిగిపోతుందన్నారు. ఈ సందర్భంగా వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకులు బుజ్జా బిక్షమయ్య కళాకారులతో ఉత్సాహాన్ని సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
నాల గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం లాంటివి ఉపాధిని, శ్రామికున్ని పనినీ పూర్తిగా తొలగిస్తుందన్నారు. ఆధునిక పరిశ్రమలు ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వకపోగా మనిషి స్థానాన్ని పూర్తిగా తొలగిస్తుందన్నారు. రాబోయే యువతరానికి ఉద్యోగాలు ఉండవని పోరాటాలు మాత్రమే కొనసాగుతాయి అన్నారు. ఆ పోరాటం ఉత్పత్తి, పంపిణీ నిజాయితీతో సమానంగా పంచే సోషలిజం మాత్రమే అంతిమ లక్ష్యం కావాలన్నారు.
ప్రొఫెసర్ వెంకటదాస్ మాట్లాడుతూ రష్యాలో అతికొద్ది కాలంలో విప్లవం విజయవంతమైంది. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ఐక్యత కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తృతమైన కృషి జరుగుతుందన్నారు. ఈ ఐక్యత మరింత దృఢంగా జరగాలన్నారు. అదేవిధంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక శక్తుల ఐక్య పోరాటమే ప్రజలకు నిజమైన బలం అన్నారు. వారి దుస్థితిని మార్చే దిక్సూచి అవుతుందన్నారు. ఎస్ యు సి ఐ రాష్ట్ర నాయకులు ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు.
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జోగి రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు తక్షణం ఏకం కావాలన్నారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్లు, అసెంబ్లీ లోపల బయట అనేక ప్రజా పోరాటాలు ఫాసిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తుందనీ సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) నాయకులు రమేష్ రాజా అన్నారు. ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుల ఐక్యతను గాఢంగా కోరుకుంటున్నారని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, మల్లేష్, పాండురంగారావు బత్తిని శ్రీనివాసరావు, వంగల సంతోష్, సోగర బేగం, జక్కుల నాగయ్య,l ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకులు, డాక్టర్ జి శ్రీనివాసరావు, జాన్ మండలి, వర్కర్స్ పార్టీ నాయకులు, లేబర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






