రాజ్యాంగంపై నమ్మకం లేకే దళితులపై వివక్ష

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఖర్గేకు జరిగిన అవమానం దళితుల ఆత్మగౌరవానికి అవమానం
– బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలు రెండో తరగతి పౌరులు
– ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా పోరాడాలి: భట్టి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ, దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన దళిత-ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, అస్పృశ్యత నిర్మూలన వంటి విలువలను అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా తొలి తీర్మానం ఆమోదించారని, అనంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేదని ఆరోపించారు. మనుస్మృతి, మను ధర్మశాస్త్ర భావజాలాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘దేశంలోని ప్రతి పౌరుడినీ ఒక్కటిగా నిలబెట్టేది భారత రాజ్యాంగమే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే దేశ పునాదులనే దెబ్బతీయడం’ అని భట్టి వ్యాఖ్యానించారు. దళితులు, ఆదివాసీలపై వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే పలు చట్టాలు తీసుకొచ్చామని, అయినప్పటికీ నేటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.

ఖర్గేకు జరిగిన ఘటనపై ఆగ్రహం

మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడు మాత్రమే కాదని, సుదీర్ఘ రాజకీయ పోరాటంతో దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించిన నాయకుడని భట్టి అన్నారు. కర్ణాటకలో మంత్రిగా, సీఎల్పీ నేతగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి సభ అనంతరం హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ ం నిర్వహించడం దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన తీవ్రమైన అంశమని భట్టి పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై కేసు ఎందుకు?

ఖర్గేకు జరిగిన ఘటనపై ఎఫఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నిరసన చేపడితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనపైనే కేసు పెట్టారని భట్టి విక్రమార్క విమర్శించారు. అవమానానికి గురైన వ్యక్తికి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారు. ఇది దళితులు, ఆదివాసీల పట్ల వ్యవస్థలో ఉన్న వివక్షను బయటపెడుతోంది అని అన్నారు.

20 కోట్ల మంది ఎస్సీలను పట్టించుకోరా?

దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు ఉన్నారని భట్టి పేర్కొన్నారు. వారందరూ సమాన హక్కులు, గౌరవంతో జీవించేలా రాజ్యాంగం కల్పించిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, మైనారిటీలు సహా కోట్లాది మందిని రెండో తరగతి పౌరులుగా చూసే పరిస్థితిని మనం అంగీకరించకూడదు.. అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఆత్మగౌరవం కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. ‘ప్రతి రాష్ట్రానికి వెళ్దాం.. ప్రజలను చైతన్యపరుద్దాం.. మన ఆత్మగౌరవం కోసం పోరాడుదాం.. ఎలాంటి అవమానాన్ని సహించబోం’ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన సామాజిక న్యాయ చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళిత, ఆదివాసీ, బలహీనవర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ జెండా కింద ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *