– మంత్రి సీతక్క హెచ్చరిక
ములుగు, ప్రజాతంత్ర, మే 6 : త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మీద, క్షణం తీరిక లేకుండా ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నేతలను ఎక్కడ చచ్చారు అని అహంతో కేటీఆర్ మాట్లాడడాన్ని ఆక్షేపించారు. దేహాలు ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడింది గాంధీ కుటుంబం .. లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచింది గాంధీ కుటుంబం.. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు.. బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. పదేండ్లు రైతులను నిర్లక్ష్యం చేసిందీ కేసీఆర్ పాలన.. వరి వేస్తే ఉరి వేసినట్లే అని అన్నది కేసీఆర్.. చావుల మీద రాజకీయం చేసిన చరిత్ర బీఆరఎస్‌ది.. తెలంగాణ ఉద్యమంలో వేలమంది చావులకు కారణం గులాబి గ్యాంగ్.. బీఆరఎస్ పాలనలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. తాలు తరుగు పేరు మీద మిల్లర్లు కోతలు పెట్టినా పట్టించుకోలేదు అని విమర్శించారు. అధికార యావ తప్ప ప్రజల క్షేమం బీఆరఎస్‌కు పట్టదని ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేయడం బీఆరఎస్‌కు చేత కాలేదు.. అదే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు ఇస్తున్నామన్నారు. అబద్ధపు ప్రచారాన్ని బీఆరఎస్ నమ్ముకున్నదని వ్యాఖ్యానించారు. సన్న బియ్యం ఇస్తామంటే అపహస్యం చేశారు.. కానీ తాము మూడు కోట్లకు పైగా జనాభాకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారం కోసం కేటీఆర్ సొంత సోదరిని వదులుకున్న దుర్మార్గుడు అని విమర్శించారు. మేడారం ఆలయంపై తప్పుడు కూతలు కూస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఫలితం అనుభవిస్తావు కేటీఆర్.. అంటూ హెచ్చరించారు. ఇతరుల చావులను కోరుకునే కేటీఆర్ నష్టపోతావు అన్నారు. రాహుల్ గాంధీని విమర్శిస్తే నీ స్థాయి పెరుగుతుందనుకుంటే పొరపాటేనన్నారు. కేటీఆర్ కారు కూతలు మానుకోవాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




