రేపు బీహార్ కేబినెట్ విస్తరణ

– మంత్రివర్గంలో నితీశ్ తనయుడు నిశాంత్ !

పాట్నా, మే 6 : బీహార్‌లో గురువారం కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. జేడీయÖ నేతలు మంగళవారం రాత్రి జరిపిన సమావేశంలో ప్రభుత్వంలో చేరాలని నిశాంత్‌ను ఒప్పించినట్టు తెలుస్తోంది. దిల్లీ నుంచి పాట్నా వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సహా జేడీయూ నేతలు ప్రస్తుతం 7 సర్క్యులర్ రోడ్డులోని నితీశ్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో మంత్రుల తుది జాబితాను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. చాలాకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న నిశాంత్ ప్రభుత్వంలో చేరేందుకు తొలుత నిరాకరించారు. అయితే మంగళవారం జరిగిన జేడీయూ సమావేశంలో సీనియర్ నేతలు ఆయనను ప్రభుత్వంలో చేరేందుకు ఒప్పించినట్టు తెలిసింది. ప్రభుత్వంలో ఆయన చేరడం పార్టీకి, రాష్ట్రానికి కూడా కీలకమని నచ్చజెప్పినట్టు సమాచారం. నిశాంత్ ప్రస్తుతం ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, నితీశ్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించేందుకు పలు జిల్లాల్లో ’బీహార్ గుడ్‌విల్ యాత్ర’ జరుపుతున్నారు. ఆయన గత మే 8న లాంఛనంగా జేడీయూలో చేరారు. కాగా, బీహార్ మంత్రివర్గ విస్తరణలో 27 మందికి చోటు కల్పించనున్నారు. బీజేపీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 11 మంది, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) నుంచి ఇద్దరు, హెచఏఎం, ఆర్ ఎల్‌ఎస్‌పీ నుంచి చెరొకరికి చోటు లభించనున్నది.

9న బెంగాల్ కేబినెట్ ప్రమాణం : సీఎం అభ్యర్థిపై సమాలోచనలు

కోల్‌కతా, మే 6: పశ్చిమ బెంగాల్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ముఖ్యమంత్రి పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. దీనిపై కసరత్తు జరుగుతుండగానే 9న ప్రమాణ స్వీకార ఏర్పాట్లు సాగుతున్నాయి. బెంగాల్ నేత ఎంపికకు పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. అందుకే శనివారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సక్ భట్టాచార్య బుధవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఉదయం 10 గంటలకు మహానగరంలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గురువారం సాయంత్రం కోల్‌కతాలో శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని, ఇందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రం మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులు హాజరవుతారని అంచనా. కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *