తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఉద్వాసన పర్వం సాగినప్పటికీ, ఇది కేవలం ఒక కుటుంబ వ్యాఖ్యల సంక్షోభం మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా రగులుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుకు ఇదొక ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది .
మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగించడం వెనుక కేవలం క్రమశిక్షణా రాహిత్యం మాత్రమే కారణం కాదని, పార్టీపై తన పట్టును మరింత బిగించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాత్మక అడుగనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా అధిష్ఠానం (హైకమాండ్) ప్రమేయం లేకుండా మంత్రులపై చర్యలు తీసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ, ఈ ఉదంతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని, నివేదికను పంపి, హైకమాండ్‌ను ఒప్పించి మరీ వేటు వేయగలిగారు. ఇది రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాటకు తిరుగులేదనే సంకేతాన్ని స్పష్టంగా పంపింది.అయితే, సురేఖ వాదన మరోలా ఉంది. స్వతంత్రంగా, వివాహం చేసుకుని వేరుగా ఉంటున్న తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ఆమె ప్రశ్నించారు. తన వెర్షన్ వినకుండా, కనీసం వివరణ సరిగ్గా తీసుకోకుండా ఏకపక్షంగా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ఆమె చేసిన కౌంటర్ ఎటాక్ కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. దిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గేను కలిసి, “చర్యలు తీసుకోవాలంటే ముందు సీఎం రేవంత్ పైనే తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేయడం పార్టీలో అసమ్మతి ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేసింది .
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం వేదికగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఈ వివాదానికి అసలు మూలకారణంగా నిలిచింది. కొండా కుటుంబానికి, రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య ఉన్న పాత విభేదాలు ఈ నెపంతో పూర్తిగా బట్టబయలయ్యాయి. అయితే, రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేవలం రాజకీయ వేటుతోనే ఆగలేదు. ఒక బీసీ సామాజిక వర్గ మహిళను మంత్రి పదవి నుంచి తొలగించడం వల్ల రాబోయే విమర్శలను, రాజకీయ నష్టాన్ని ముందే ఊహించిన సీఎం, తక్షణమే వ్యూహాత్మక డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లా నుంచే మరో బీసీ మహిళా నేత గుండు సుధారాణిని కుడా చైర్‌పర్సన్‌గా నియమించడంతో పాటు, గద్వాల్ విజయలక్ష్మిని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా, నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించి మహిళా, బీసీ వోటు బ్యాంక్ చెదిరిపోకుండా జాగ్రత్తపడ్డారు.
కానీ, ఈ నామినేటెడ్ పదవుల భర్తీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వగలదు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన నాటి నుండి “వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు” అనే అంతర్గత కుమ్ములాటలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. కొండా సురేఖ లాంటి బలమైన మాస్ లీడర్‌పై వేటు వేయడం ద్వారా, పార్టీలో తన నాయకత్వాన్ని వ్యతిరేకించే లేదా ధిక్కరించే వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బలమైన హెచ్చరిక పంపినట్లయింది. రేవంత్ తన పట్టును బిగించుకోవడానికి ఇది పనికొచ్చినా, పార్టీ సీనియర్లలో ఒక రకమైన అభద్రతా భావాన్ని, అసంతృప్తిని పెంచే ప్రమాదం ఉంది.
“మరోవైపు, కేబినెట్ నుంచి డాక్టర్ జి. చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుండి అకస్మాత్తుగా తప్పించడం పార్టీలోని ముఠా రాజకీయాలకు పరాకాష్ట. కొండా మురళి, సురేఖ దంపతులు ఒకప్పుడు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడానికి తామే మొదట మద్దతు ఇచ్చామని, ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీని సీఎం విస్మరించారని బహిరంగంగా గుర్తు చేయడం గమనార్హం. కేవలం క్రమశిక్షణ ఉల్లంఘన నెపంతో సీనియర్లను ఇలా పక్కనపెట్టడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవొచ్చు . ఈ అంతర్గత అసమ్మతిని చక్కదిద్దకుండా, సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ధైర్యంగా ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
ఈ రాజకీయ సంక్షోభం కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదు; ఇది నేరుగా రాష్ట్ర పరిపాలనపై ప్రభావం చూపుతుంది. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, నాయకులు దిల్లీ చుట్టూ తిరగడం, ప్రెస్ మీట్లతో విమర్శలు చేసుకోవడం వల్ల పాలన కుంటుపడుతుంది. విపక్షాలకు ఇది ఒక పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం గ్రూపు రాజకీయాల అణచివేతపైనే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో, ఈ అంతర్గత కుమ్ములాటలు ఆఖరుకు ప్రభుత్వ స్థిరత్వానికే ముప్పుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. పరిపాలనలో పారదర్శకత, రాజకీయాల్లో సంయమనం పాటించినప్పుడే ఏ ప్రభుత్వమైనా ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోగలదని గ్రహించాలి.





