రాష్ట్రంలో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ సంక్షోభం!

తెలంగాణ విద్యా రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా ఫీజు రీఇంబర్స్ మెంట్  స్కాలర్‌షిప్‌ బకాయిలు పేరుకుపోవడం విద్యా వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నది. నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం, నేడు నిధుల కొరత, ప్రభుత్వాల అలసత్వం వల్ల పడకేసింది. ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ 48 గంటల పాటు చేపట్టిన నిరాహార దీక్షలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు కేవలం రాజకీయ రచ్చ కావు. అవి క్షేత్రస్థాయిలో ఉన్న తీవ్రమైన విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి.


ఈ నిధుల కొరతపై ప్రతిపక్షాలు శాసనసభ లోపలా, వెలుపలా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. ఎన్నికల గ్యారంటీల అమలుపై నిలదీస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఈ వివాదంలోకి లాగడం సమస్య  తీవ్రతను సూచిస్తున్నది . మరోవైపు బిఆర్ఎస్ శ్రేణులు కూడా కాలేజీల బంద్‌ల‌కు పిలుపునిస్తూ క్షేత్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, పాలకుల అలసత్వం వల్ల విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల ప్రభావం నేరుగా విద్యా సంస్థల మనుగడపై పడుతున్నది. రాష్ట్రంలోని మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలు ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి నడుస్తుంటాయి. గత కొన్ని బడ్జెట్లలో వీటికి తగిన కేటాయింపులు జరగకపోవడం, విడుదలైన నిధులు కూడా ఒకింత నామమాత్రంగానే ఉండటంతో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కాలేజీల నిర్వహణ ఖర్చులు, భవనాల అద్దెలు, ల్యాబ్ పరికరాల నిర్వహణ భారం కావడం ఒకెత్తయితే… అధ్యాపకులు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. జీతాలు అందక ప్రతిభావంతులైన అధ్యాపకులు విద్యా రంగాన్ని వీడుతున్నారు. ఇది పరోక్షంగా విద్యా ప్రమాణాల క్షీణతకు కారణమవుతున్నది. చాలా చోట్ల యాజమాన్యాలు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనివల్ల చదువు పూర్తయినా చేతికి సర్టిఫికెట్లు రాక, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న గ్రామీణ విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం.


తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా, డిజిటల్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్న ప్రభుత్వం, దానికి మూలస్తంభాలైన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించడం దారుణం. ఉచిత గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు వేల కోట్లు కేటాయిస్తున్న తరుణంలో, మానవ వనరుల వికాసానికి అత్యంత కీలకమైన విద్యా రంగానికి నిధులు నిలిపివేయడం శోచనీయం. బడ్జెట్ ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉచితాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తే, నాణ్యమైన విద్య ఒక తరాన్నే మార్చేస్తుంది. నిధుల కొరతను సాకుగా చూపి విద్యా హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, ఒకే విడతలో కాకపోయినా, కనీసం ప్రాధాన్యత క్రమంలో బకాయిలను విడుదల చేసేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ప్రకటించాలి. రాబోయే బడ్జెట్లో విద్యకు కేటాయింపులను గణనీయంగా పెంచడంతో పాటు, నిధుల విడుదలకు ఒక పారదర్శకమైన ఆటోమేటిక్ ట్రిగ్గర్ మెకానిజంను తీసుకురావాలి. అప్పుడే విద్యా సంస్థలు నిలదొక్కుకుంటాయి, విద్యార్థులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అక్షరం అనేది ఒక వ్యాపార వస్తువు కాదు, అది ప్రతి పేదవాడి సామాజిక సాధికారతకు ఆయుధం. విద్యా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, తెలంగాణ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా పాలకులపైనే ఉంది. ఈ ఫీజుల సంక్షోభం కేవలం విద్యా సంస్థల ఆర్థిక ఇబ్బందులతోనే ముగిసిపోవడం లేదు. ఇది సమాజంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి మరియు సామాజిక అసమానతలకు దారితీస్తోంది. ప్రభుత్వ సాయం సకాలంలో అందకపోవడంతో, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వొస్తున్నది. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలవుతుంటే, విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు.

ఫలితంగా, ఎంతో మంది ప్రతిభావంతులైన యువతీ యువకులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇది తెలంగాణ సాధించిన అక్షరాస్యత ప్రగతిని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టే ప్రమాదకర పరిణామం. ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు ఫీజుల కోసం క్లాసుల నుండి బయటకు పంపుతుంటే, మరోవైపు భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన విద్యార్థుల ఆవేదనను పాలకులు గుర్తించాలి.మరో ముఖ్యాంశం ఏమిటంటే, ఈ నిధుల ఆలస్యం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా పరిశోధనలు,  ఉన్నత విద్యా ప్రమాణాలు కుంటుపడుతున్నాయి. తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తామన్న పాలకుల నినాదాలు క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలకు మరియు విద్యా రంగానికి మధ్య సమతుల్యత లోపించినప్పుడు ఏ రాష్ట్రమైనా దీర్ఘకాలంలో నష్టపోతుంది. మానవ వనరుల వికాసం లేని భౌతిక వృద్ధి శూన్యం. కేవలం భవనాలు, రోడ్ల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇస్తూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అక్షర యజ్ఞాన్ని నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికైనా శ్రేయస్కరం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *