కోర్టులు, కమిషన్లు చెబితేనే కదులుతారా?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ ఆర్‌సీ) సుమోటోగా స్పందించి విచారణ చేపట్టడం ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది . నిజానికి గతంలో విద్యార్థులే పాఠశాల సౌకర్యాల కోసం న్యాయవ్యవస్థను ఆశ్రయించిన అంశాన్ని ప్రజాతంత్ర ప్రస్తావించింది; ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ రాష్ట్రవ్యాప్త సమీక్ష నిర్వహించడం విశేషం. ప్రజా సంక్షేమం, ఐటీ రంగంలో పురోగతి గురించి గొప్పలు చెప్పుకునే పాలకులు, ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఏటా బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులు పెంచుతున్నామని కాగితాలపై అంకెలు చూపిస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఆ నిధులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామనే ప్రభుత్వాల ప్రకటనలు కేవలం ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి.
అత్యున్నత మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని చీవాట్లు పెట్టే వరకు ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పాలకుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ఉన్నతాధికారులకు కనీస పర్యవేక్షణ కరువైందనడానికి ఈ దుస్థితే నిదర్శనం. ప్రతి చిన్న విషయానికి కోర్టులు, కమిషన్లు ఆదేశాలు ఇస్తేనే తప్ప ప్రభుత్వాలు కదలవా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేయ‌డం మొద్దు నిద్ర‌లో వున్న ప్ర‌భుత్వాన్ని త‌ట్టి లేప‌డ‌మే! ఆదిలాబాద్, జనగాం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కమిషన్ తెప్పించుకున్న అధికారిక నివేదికలు పాఠశాలల దయనీయ స్థితిని కళ్ళకు కట్టాయి. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన భవనాలు, మరుగుదొడ్ల తీవ్ర కొరత వంటి అంశాలు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బహిర్గతం చేశాయి. ఇది కేవలం నాలుగు జిల్లాల సమస్య మాత్రమే కాదు; రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి తాండవిస్తున్నదనడంలో  ఎలాంటి సందేహం లేదు.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను పొందే హక్కు ఉంది. కానీ, ఆచరణలో మాత్రం భద్రత లేని తరగతి గదుల్లో, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల నీడన విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చదువుకోవాల్సి వొస్తున్నది . ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో పనిచేసే మరుగుదొడ్లు లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ నేప‌థ్యంలో సురక్షితమైన తరగతి గది, పనిచేసే మరుగుదొడ్డి, కనీస సదుపాయాలు లేకపోవడం పిల్లల భద్రత, ఆరోగ్యం, గౌరవం, విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తుందని, రాజ్యాంగంలోని 21ఎ అధిక‌ర‌ణ‌ కింద విద్యాహక్కు అంటే కేవలం పాఠశాలలో ప్రవేశం కల్పించడం మాత్రమే కాకుండా సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో చదివే అవకాశం కూడా అని కమిషన్ స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.
పాఠ‌శాల‌ల్లో స‌రైన స‌దుపాయాలు లేక‌పోవ‌డం విద్యార్థుల‌ చదువుపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మౌలిక వసతుల కొరత కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పేద విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య దూరం అవుతున్నది .ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ చేసిన సిఫారసులు అత్యంత కీలకమైనవి మరియు సకాలంలో వొచ్చినవి . రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల (డీఈఓ) నుంచి పాఠశాలల్లో ప్రాథమిక వసతులపై సమగ్ర నివేదికలు తెప్పించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కమిషన్ ఆదేశించడం సరైన చర్య. ఈ ప్రక్రియను కేవలం విద్యాశాఖకే పరిమితం చేయకుండా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయిలో పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టాలని సూచించడం ద్వారా ఈ సమస్యకు ఉన్న తీవ్రతను కమిషన్ స్పష్టం చేసింది.కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, రాబోయే ఆరు నెలల్లోగా క్షేత్రస్థాయిలో మార్పులు చూపిస్తూ కంప్లయన్స్ రిపోర్ట్ (అనుసరణ నివేదిక) సమర్పించాలని గడువు విధించడం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచింది.
సురక్షితమైన తరగతి గదులు నిర్మించడం, పనిచేసే స్థితిలో మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావడం, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడం వంటి పనులను ప్రభుత్వం ఇప్పుడు యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ‘మన ఊరు – మన బడి’ వంటి కార్యక్రమాల ద్వారా కొంత మార్పు వొచ్చినప్పటికీ , నిధుల కొరత లేదా నిర్వహణ లోపం వల్ల ఇంకా అనేక పాఠశాలలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. తెలంగాణ అభివృద్ధి సాధనలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మానవ వనరుల వికాసానికి పాఠశాలలే పునాది రాళ్ళు. కాబట్టి, మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం కేవలం ఒక చట్టపరమైన ఉత్తర్వుగా కాకుండా, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక సువర్ణ అవకాశంగా భావించాలి. బడ్జెట్‌లో పాఠశాలల మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అధికారులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రతి పాఠశాలను సందర్శించి వసతుల కల్పనను పర్యవేక్షించాలి. ఆరు నెలల గడువులోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని, విద్యార్థులకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తును అందించడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *