– కేంద్ర మంత్రి మాండవీయతో వాకిటి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు రాష్ట్ర క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. న్యూదిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని గురువారం కలిశారు. ఆయనతోపాటు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేన రెడ్డి ఉన్నారు. తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడలను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మాండవీయకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణలో ఎలాంటి లోపాలు, విమర్శలకు తావులేకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయం తీసుకుని, ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానిస్తారని తెలిపారు. తమ ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి వాకిటి చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచుతామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





