– మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం ఆదేశాలు
– కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన
– 22-ఎ విషయంలో మీ భూములు పోకుండా చూస్తా
– అండగా అభివృద్ధి చేసి చూపిస్తా
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఆనాడు తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కూకట్‌పల్లి ప్రజలు ఆశీర్వదించారు.. అయితే ప్రతిపక్షంలో ఉన్నందున మీరు ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేకపోయా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూకట్‌పల్లిని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని రకాల అధికారం ఉందంటూ మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశిస్తున్నానన్నారు. పదేళ్ల బీఆరఎస్ పరిపాలనను, ఈ తమ్ముడి రెండేళ్ల తమ పాలనను బేరీజు వేసుకోండని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించామని, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమేగాక ఆ బస్సులకు య్పుమానులను చేశామని, స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా తాము వెనక్కి తగ్గలేదన్నారు. ఆడ బిడ్డలు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించామని, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శ్రీకారం చుట్టిందని, మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటానని, 22-ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీకు ఆందోళన వద్దని, సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది.. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం అని చెప్పారు. కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారని, అయినా దేవుడు మన వైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు.. మంచి మనసుతో అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది అని సీఎం రేవంత్ చెప్పారు. మీరు అండగా ఉండండి.. అభివృద్ధి చేసి చూపిస్తా అని మరోమారు హామీ ఇచ్చారు.
వచ్చే బోనాలు ఇందిరమ్మ టవర్స్ నుంచే..
– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన జరిగిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నుంచే వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం కమీషన్లు రావన్న కారణంగా పేదలకు ఇళ్ళు కట్టలేదని, కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఎకరా రూ.200 కోట్ల వరకు ఉన్నప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో పెద్దపెద్ద టవర్స్ పక్కనే పేదలకు కూడా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి ఆచరణలోకి తెచ్చిందన్నారు. హస్తం పార్టీ రాష్ట్ర ప్రజలకు నేస్తమని అంటూ ఈ ప్రభుత్వం తల తాకట్టు పెట్టి అయినా పేదలకు ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా చేపడుతుందన్నారు. తొలివిడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించామని, దీనికి సంబంధించి ఇప్పటివరకు 51 వేల దరఖాస్తులు వచ్చాయని, మరో రెండు రోజుల్లో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగుస్తుందని మంత్రి చెప్పారు. ఎలాంటి లాలూచీలు లేకుండా మంత్రులు సహా ఎవరి సిఫారసులు లేకుండా అందరి ముందు లక్కీ డిప్ తీసి పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తామన్నారు. లబ్దిదారులకు ముందే ఇళ్ల వివరాలు అందిస్తాం కనుక వారు దగ్గరుండి కాంట్రాక్టర్‌తో తమ ఇళ్లను నాణ్యతతో కట్టించుకోవచ్చని సూచించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే మరో రెండున్నరేళ్లలో మూడింతలు ఎక్కువగా ఇళ్లు నిర్మిస్తామని, అది చేయకపోతే తాను శాసనసభకు పోటీ చేయనని మరోసారి మంత్రి పొంగులేటి ప్రకటించారు. గతంలోనే ఈ ఛాలెంజ్ విసిరినప్పటికీ కిండర్ కింగ్ దీన్ని స్వీకరించలేదన్నారు. అంతేగాక పిట్ట కథలు చెబుతూ పేదలను, పేదల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు ఎమ్మెల్యేలు తమ దృష్టికి తెచ్చారని, అవి ప్రభుత్వ భూములు కాకపోతే రెండు రోజుల్లోనే ఆ భూములపై నిషేధం తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




