“మునుపటి తరాల్లో కనిపించిన సిగ్గు, బిడియం, మొహమాటం, ‘మనకెందుకులే’ అనే ధోరణికి భిన్నంగా జెన్ జీ మరింత నేరుగా స్పందిస్తోంది. జెన్ ఆల్ఫా కూడా క్రమంగా సామాజిక చర్చల్లోకి వస్తోంది. పాతతరం అనుభవాల భుజాలపై నిలబడి భవిష్యత్తును చూసే ఈ కొత్త తరాల ఆలోచనలను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు అర్థం చేసుకోవాలి..”
ప్రజల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తరాలు మారేకొద్దీ ఆలోచనలు, ఆకాంక్షలు, ప్రశ్నలు మారుతాయి. ఉద్యమాల రూపాలూ మారుతాయి. ప్రజల సమస్యలు, నాయకత్వం, సామాజిక పరిస్థితులు, కాలానికి అనుగుణంగా పోరాటాల స్వభావం, తీవ్రత మారుతుంటాయి. కొన్ని ఉద్యమాలు తారాస్థాయికి చేరి విజయాన్ని సాధిస్తే, మరికొన్ని లక్ష్యాన్ని చేరకముందే ఆగిపోతాయి. కానీ ప్రతి ఉద్యమం తరువాతి తరానికి ఒక అనుభవాన్ని, ఒక ప్రశ్నను, ఒక పాఠాన్ని మిగులుస్తుంది.
ఇప్పుడు భారతదేశంలో తరం మారింది. దానితోపాటే యువత స్వరం కూడా మారుతోంది. పాత తరాలకు భిన్నంగా జెన్ జీ ఆలోచిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో కలిసి పెరిగిన ఈ తరం సమాచారాన్ని వేగంగా అందుకుంటోంది. ఒక ప్రకటనను గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న వాస్తవాలను వెతుకుతోంది. ప్రశ్నించడం, ఆధారాలు అడగడం, తర్కించడం వారి సహజ లక్షణాలుగా మారుతున్నాయి. మునుపటి తరాల్లో కనిపించిన సిగ్గు, బిడియం, మొహమాటం, ‘మనకెందుకులే’ అనే ధోరణికి భిన్నంగా జెన్ జీ మరింత నేరుగా స్పందిస్తోంది. జెన్ ఆల్ఫా కూడా క్రమంగా సామాజిక చర్చల్లోకి వస్తోంది. పాతతరం అనుభవాల భుజాలపై నిలబడి భవిష్యత్తును చూసే ఈ కొత్త తరాల ఆలోచనలను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు అర్థం చేసుకోవాలి.
భారత్‌లో జెన్ జీ ఉద్యమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండవచ్చు. గతంలో అనేక ఉద్యమాలు ఒక వర్గం, కులం, ప్రాంతం లేదా నిర్దిష్ట సమస్య కేంద్రంగా సాగాయి. కానీ డిజిటల్ యుగంలోని యువత సమస్యలను భౌగోళిక సరిహద్దులకు అతీతంగా చూస్తోంది. విద్య, పరీక్షలు, ఉద్యోగాలు, అవినీతి, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలు వారిని కలుపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల తీరుపై యువతలో అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విశ్వాసం కొనసాగడం గమనించాల్సిన విషయం. ఢిల్లీ జంతర్‌మంతర్ నుంచి హైదరాబాద్, జార్ఖండ్ వరకు జరిగిన వివిధ విద్యార్థి నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ జెండా కనిపించడం దీనికి సంకేతం. జాతీయవాదమంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సమర్థించడం కాదని, రాజ్యాంగ విలువలను కాపాడటం కూడా దేశభక్తేనని కొత్తతరం తనదైన భాషలో చెబుతోంది.
మనకు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, విస్తృతమైన లిఖిత రాజ్యాంగం ఉన్నాయి. కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఆచరణలో కనిపించనప్పుడు అసంతృప్తి సహజం. నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యావకాశాలు, ప్రభుత్వ వ్యవస్థల జవాబుదారీతనం వంటి అంశాలపై యువత ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నిరసనలను అణచివేయాలని ప్రయత్నిస్తే అసంతృప్తి మరింత తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపైనా యువత ప్రశ్నలు సంధించడం ప్రత్యేకంగా గమనించాలి. రాజ్యాంగ సంస్థలపై గౌరవం ఉండటం అంటే వాటి పనితీరును ప్రశ్నించకూడదని కాదు. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి సంరక్షకురాలు; రాజ్యాంగానికి అతీతమైన వ్యవస్థ కాదు. న్యాయమూర్తుల వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఉందనే ఆరోపణలు, పదవీ విరమణ అనంతరం న్యాయమూర్తులు రాజకీయ లేదా ప్రభుత్వ పదవులు స్వీకరించడం వంటి అంశాలపై యువత ప్రశ్నలు వేస్తోంది. వాటిని అవమానంగా కాకుండా ప్రజాస్వామ్య చర్చలో భాగంగా చూడాలి.
ఇటీవలి విద్యార్థి ఉద్యమాలు, ముఖ్యంగా న్యాయ విద్యార్థుల స్పందనలు ఈ మార్పును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. తమ విశ్వవిద్యాలయ కార్యక్రమాలకు ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని ఆహ్వానించకూడదనే అంశంపై విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేయడం అసమ్మతి హక్కులో భాగమే. ఆ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు; కానీ వారి విద్యా లేదా వృత్తిపరమైన భవిష్యత్తును దానితో ముడిపెట్టి బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నల్సార్ విద్యార్థుల వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించిన తీరు వివాదాస్పదమైంది. విద్యార్థుల నమోదుపై ఆంక్షల దిశగా వెళ్లి, అనంతరం ఆ నిర్ణయాన్ని సవరించి చివరకు వెనక్కి తీసుకోవాల్సి రావడం సంస్థలు యువత అసమ్మతిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ప్రశ్నించడం విద్యార్థుల నైతిక హక్కు మాత్రమే కాదు—రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్ఛలో భాగం.
ఇవాళ్టి న్యాయ విద్యార్థులే రేపటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ రక్షకులు. వారు చదువుతున్న వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించినందుకు వారి వృత్తి భవిష్యత్తుపై చర్యల హెచ్చరికలు రావడం సరైన సంకేతం కాదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా ప్రతి చట్టబద్ధ సంస్థ కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. అసమ్మతికి సమాధానం సంభాషణ కావాలి; శిక్ష కాదు.ఈ సంఘటన నుంచి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, విశ్వవిద్యాలయాలు, న్యాయ సంస్థలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. కొత్త తరాన్ని పాత పద్ధతులతో నియంత్రించడం సాధ్యం కాదు. సోషల్ మీడియా, డిజిటల్ సమాచార వ్యవస్థ యువతకు తన వాదనను క్షణాల్లో దేశవ్యాప్తంగా తీసుకెళ్లే శక్తిని ఇచ్చాయి. అందువల్ల అణచివేత కన్నా సంభాషణ, బెదిరింపు కన్నా వివరణ, అధికార ప్రదర్శన కన్నా జవాబుదారీతనం అవసరం.
అదే సమయంలో యువత ఉద్యమాలు కూడా రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ఆధారాలతో ముందుకు సాగాలి. హేతువాదం అంటే ప్రతి వ్యవస్థను తిరస్కరించడం కాదు; లోపాలను ప్రశ్నిస్తూ వ్యవస్థను మెరుగుపరచడం. అసమ్మతి ప్రజాస్వామ్యానికి శత్రువు కాదు—దాని జీవశక్తి. దేశంలో తరం మారింది. వారి స్వరం కూడా మారింది. గత తరాల మాదిరిగా యువతను అణచివేయవచ్చని, ప్రశ్నలను పట్టించుకోకుండా ముందుకు సాగవచ్చని ఏ వ్యవస్థ భావించినా అది తీవ్రమైన పొరపాటు. జెన్ జీ అడుగుతున్న ప్రశ్నలు ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు; న్యాయవ్యవస్థతో సహా ప్రతి రాజ్యాంగ సంస్థకూ వర్తిస్తాయి.
యువత ప్రశ్నలను అణచివేయడం కాదు—వినాలి. సమాధానం చెప్పాలి. అవసరమైతే వ్యవస్థలను సరిదిద్దాలి. అదే ప్రజాస్వామ్యానికి బలం అదే రాజ్యాంగానికి నిజమైన గౌరవం.
– తోటకూర రమేష్
98661 68676





