- గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య
- భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం
- భారీగా తరలివచ్చి వీక్షించిన జన
- పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం
కోలాటాలు.. భజనలు.. తీన్మార్ స్టెప్పులు.. భాజాభజంత్రీలు… గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గణేస్ నిమజ్జన వేడుకలు శోభాయమానంగా జరిగాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. ప్రజలు తండోపతండాలుగా తరలి వొచ్చి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించి తన్మయులయ్యారు. ఈ క్రమంలో అనుకున్న సమయానికే ఖైరతాబాద్ మహా గణేశుడి విగ్రహ నిమజ్జనం అంగరంగా వైభవంగా జరిగింది. జయజయధ్వానాల మధ్య అంతిమ పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం ఒంటిగంటన్నరకు పూర్తయ్యింది. ట్యాంకుబండ్‌పై నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా బడా గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి కోసం హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తాయి. మహాగణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బడా గణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. గతేడాది నుంచి ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ముందుగానే జరుపుతున్నారు. ఖైరతాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ దుగా ట్యాంక్‌బండ్ చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత.. మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు.
నాలుగో నంబర్ క్రేన్ వద్ద లంబోధరుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారింది. ఖైరతాబాద్ గణేషుడికి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్నస్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడిని అలంకరించారు. 11 రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
ఈసారి రూ.కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డుకెక్కారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నంబర్ 4 వద్ద పరిశీలించారు. అక్కడి నుంచే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. ఇక ఉదయం నుంచే పలు ప్రాంతాల నుంచి గణేశ్ విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాయి. సూపర్ క్రేన్ ద్వారా 70 అడుగుల మహాశక్తి గణపతిని నిమజ్జనం చేశారు.