ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కీల‌క నిర్ణ‌యం

– మండలస్థాయిలో సమన్వయ కమిటీలు
– గ్రామీణ ఉపాధి, పశుగ్రాసం, తాగునీటికి ప్రాధాన్యం
– కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు
– జి.ఓ.ఆర్.టి. నెం.579 జారీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయం, పశుసంపద, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలను చేపట్టి, ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పశుగ్రాసం, తాగునీటి భద్రతకు భరోసా కల్పించేందుకు మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్ జి.ఓ.ఆర్.టి. నెం.579ను జారీ చేశారు. వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం, 2025 (వీబీ–జీ రామ్ జీ) కింద చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) అధ్యక్షతన మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీరాజ్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. మండల పరిషత్ అధికారి (హెచ్పీఓ) కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఇతర శాఖల అధికారులను కూడా కమిటీలో చేర్చుకునే అవకాశం కల్పించారు. గ్రామీణ కుటుంబాలకు కూలి ఉపాధి కల్పించేందుకు అన్ని గ్రామాల్లో అనుమతించదగిన పనులు అందుబాటులో ఉండేలా కమిటీలు చర్యలు తీసుకుంటాయి. కూలీల సమీకరణ, పని దినాల కల్పన, వేతనాల సకాలంలో చెల్లింపులను పర్యవేక్షిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా అవసరమైన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేస్తాయి. పశువులకు అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామపంచాయతీలు, గ్రామీణ ఆవాసాల పరిధిలో ఉన్న 35,959 చిన్న నీటిపారుదల చెరువులను గుర్తించి, నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాసం సాగుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆదేశించింది. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాల ద్వారా పశుగ్రాసం సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారు. వ్యవసాయ బోర్లు లేదా ఇతర నిర్ధారిత నీటి వనరులు కలిగిన రైతులను గుర్తించి వ్యక్తిగత స్థాయిలోనూ పశుగ్రాసం సాగును ప్రోత్సహిస్తారు. పశువుల మేత కొరతను ముందుగానే అంచనా వేసి, అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తారు.పశువులు, మేకలు, గొర్రెలకు తగినంత తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పశువుల నీటి తొట్టెలను నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్న తొట్టెలను పరిశీలించి మరమ్మతులు చేపడతారు. వేసవిలోనూ పశువులకు నిరంతరాయంగా తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. తాగునీటి కొరత ఎదురయ్యే గ్రామాలను గుర్తించి, గ్రామీణ నీటి సరఫరా శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన మరమ్మతులు, ఇతర నివారణ చర్యలు చేపడతారు. గ్రామీణ తాగునీటి మౌలిక సదుపాయాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షిస్తారు.నీటి భద్రతలో భాగంగా చిన్న నీటిపారుదల చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్ల అభివృద్ధి, మరమ్మతులతో పాటు వ్యవసాయ కుంటలు, మ్యాజిక్ సోక్ పిట్స్, డ్రెయిన్ ఎండ్ సోక్ పిట్స్, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, చెక్‌డ్యామ్‌ల వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునర్భరణ ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు చేపడతారు.గ్రామీణ రహదారులు, కల్వర్టులు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులను అవసరాలకు అనుగుణంగా చేపడతారు. పశువుల షెడ్లు, మేకల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమకు సంబంధించిన పనుల ద్వారా గ్రామీణ కుటుంబాల జీవనోపాధి భద్రతకు తోడ్పడతారు. ప్రతి గ్రామపంచాయతీలో మౌలిక సదుపాయాల కొరతను గుర్తించి, గ్రామసభల భాగస్వామ్యంతో అవసరమైన పనులను ప్రణాళికలో చేర్చుతారు.
మండల సమన్వయ కమిటీలు కనీసం వారానికి ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించాలి. గుర్తించిన పనులు, మంజూరైన పనులు, ప్రారంభించిన పనులు, పూర్తయిన పనులు, కల్పించిన ఉపాధి, నీటి సంరక్షణ పనులు, జలసిరి కార్యక్రమం తదితర అంశాలపై పురోగతిని పరిశీలించాలి. పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకోవాలి.ప్రతి కమిటీ వారపు పురోగతి నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పించాలి. సిద్ధం చేసిన వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను సంబంధిత గ్రామపంచాయతీ జీపీ సాప్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అన్ని మండలాల్లో కమిటీల ఏర్పాటు, ఎల్ నినో నివారణ చర్యల సమర్థవంతమైన అమలు, కమిటీల పనితీరుపై క్రమం తప్పకుండా సమీక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, పశుగ్రాసం, తాగునీరు, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడనున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *