పథకాల అమలులో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

– 38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి
– బీసీ గురుకులాల సొంత భవనాలకు స్థల సేకరణ పూర్తి చేయాలి
– బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: అర్హులైన మెరిట్ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకాన్ని పూర్తి పారదర్శకతతో పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాలు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, బీసీ వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. 38 ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంగా ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథŠకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని, సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డిసెంబర్ 9న లబ్దిదారులకు కుట్టు మిషన్లు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని, టెండర్ ప్రక్రియతోపాటు ఇతర అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో ఆర్సీవోలు పర్యటించి మౌలిక సదుపాయాలు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, సొంత భవనాల స్థితిగతులు తదితర అంశాలపై నివేదికలు అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 327 గురుకుల పాఠశాలల్లో 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా మిగిలినవి ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. 37 గురుకులాలకు సొంత స్థలాలు ఉన్నందున వాటిలో భవనాల నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. గురుకులాలకు అవసరమైన స్థలాల సేకరణను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గురుకులాల సమస్యల పరిష్కారంపై సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లకు లేఖలు రాసి విద్యార్థులకు ఎల్‌నినో ప్రభావం, నీటి పొదుపు, విద్యుత్ వినియోగంలో మితవ్యయం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపట్టాలి

బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా నాణ్యమైన శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ అంశంపై ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా సమర్థవంతమైన డైరెక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి యూపీఎస్సీ, గ్రూప్-1 వంటి పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అవకాశాలు కల్పించేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. మధిర వంటి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా పశువుల పంపిణీ తరహా ఉపాధి పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఎసఎంఈ కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు వివిధ కుల సంఘాలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ వితంతువులు, ఒంటరి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో రజకుల కోసం ఆధునిక ధోబీఘాట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీపై సమీక్షిస్తూ శిక్షణ పూర్తి చేసుకున్న లబ్దిదారులకు వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరా కేఫ్, నందనవనాల నిర్వహణ, అభివృద్ధి అంశాలపై చర్చించారు. వాటిని అధికారులు స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల కార్యదర్శి సైదులు, అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, పద్మ, మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *