– వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి
– 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు డిజైన్లు
– జాతీయ సాంకేతిక సంస్థల సూచనల మేరకే పనులు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారంలో ప్రారంభించి 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మూడు బ్యారేజీల భద్రత పటిష్టంతోపాటు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు డిజైనర్ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో గ్రౌటింగ్ ద్వారా పునాదులను బలోపేతం చేయడం, స్టిల్లింగ్ బేసిన్లను పొడిగించడం, కొత్తగా కట్-ఆఫ్ వాల్స్ నిర్మించడం వంటి కీలక పనులు ఉన్నాయని తెలిపారు. వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడంతోపాటు పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, పునాదుల కింద నీటి చొరబాటును అరికట్టడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్ఏ)తోపాటు ఇతర నిపుణుల కమిటీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ భద్రత, పునరుద్ధరణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయస్థాయి సాంకేతిక సంస్థల సిఫారసుల ఆధారంగానే ప్రతీ పని జరుగుతుంది అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపాదిత డిజైన్లను పుణేలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుందో, ప్రతిపాదించిన చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారని చెప్పారు. ఖరారు చేసిన డిజైన్లను అక్టోబర్ 5న దిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. కమిటీ నిపుణులు వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫారసులు చేస్తారని తెలిపారు. సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పునరుద్ధరణ పనులకు సంబంధించిన సమగ్ర వ్యయ అంచనాలను నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి కోసం అవసరమైన కాంట్రాక్టు విధానాన్ని కూడా ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లు పిలిచి పనులను అప్పగించేలా మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనుల అమలులో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా సాంకేతికంగా పటిష్టమైన, దీర్ఘకాలం మన్నే విధానాలతో మూడు బ్యారేజీలను పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తయి, జాతీయ సాంకేతిక సంస్థల నుంచి అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకొస్తాం అని తేల్చిచెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటిస్తూ, ప్రతి దశను నిపుణుల పరిశీలనకు లోబడి నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమంతో సంబంధం ఉన్న ఇంజినీర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





