వినికిడి లోపం కలిగిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

  • వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు..
  • ఉచిత వైద్య సేవలతో పాటు మందుల పంపిణీ

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలోని టీటీడీ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపం కలిగిన పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ, మెడికవర్ ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబిక, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పూజ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు సభ్యురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడి, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. దివ్యాంగులకు సేవ చేయడం విశ్వమానవ సేవతో సమానమని ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సేవల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, వారి హక్కులను పరిరక్షించడంతో పాటు గౌరవించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైద్యులు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సమ్మ, కాజీపేట ఏఎస్ఐ, వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *