సమ సమాజ స్థాపన కోసమే రాజ్యాంగ వ్యవస్థ

  • రాజ్యాంగ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలి
  • జస్టిస్ పిఎస్ నారాయణ

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర మార్చి 18 : సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ దేశ ప్రజలందరికీ దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ (Justice PS Narayana)  అన్నారు. భారత రాజ్యాంగం సామాజిక అభ్యున్నతికి దోహదపడే అత్యంత విలువైన డాక్యుమెంట్ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) లోని ఎస్సీ, ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం మైలురాయి సమస్యలు సవాళ్లు” అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశానికి జస్టిస్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి కెయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ నారాయణ మాట్లాడుతూ.. భారతీయ సమాజం కలయిక సమాజమని భారతదేశంలో నివసించే వ్యక్తులందరూ ఆరోగ్యకరమైన రాజ్యాంగం పరిధిలో జీవించబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్య, వైద్య సామాజిక అభివృద్ధి రంగాలకు, భావవ్యక్తీకరణ కోసం ఆర్టికల్ 19 స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం అంశాలతో కూడుకున్న భారత రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో మనమందరం భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.

రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి..

హైకోర్టు పూర్వ న్యాయ మూర్తి డాక్టర్ జస్టిస్ చంద్రయ్య వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. విద్య మానవ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సమాజానికి భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అన్ని గ్రంథాలతోపాటు రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలని, అప్పుడే రాజ్యాంగంలోని హక్కులు తెలుస్తాయని అన్నారు. సమాజంలో నిలదొక్కుకోవాలంటే విద్య తప్పనిసరి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించాలని అప్పుడే ప్రతిఒక్కరికి విద్య హక్కు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వం అందించడానికి రాజ్యాంగంలో పేర్కొన్న విలువైన సమాచారాన్ని తెలుసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని అప్పుడే ప్రజలకు రాజ్యాంగపు హక్కులు ఉంచుకోగలుగుతారని జస్టిస్ చంద్రయ్య అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకునే అధికారం ప్రజలకు ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నట్లుగా సమానత్వం, మానవ హక్కులు పొందే దిశగా మనం ముందుకు పోవాలన్నారు. రాజ్యం ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగానికి లోబడి పాలన కొనసాగించాలని.. అప్పుడే ప్రజాస్వామిక వ్యవస్థ కొనసాగుతున్నట్లు తెలుస్తుందన్నారు. రిలీజియన్, క్యాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంశాలను ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

కేయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ విలువలు లేని వ్యవస్థ ఉందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని, దేశంలో నిజాయితీ గల రాజకీయ వ్యవస్థ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీ రాజకీయాలు ఉన్నాయని 75 ఏళ్లుగా భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు పూనుకున్నట్లుగానే ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగిన దేశంలో భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు నెలకొని ఉన్నాయన్నారు. ముఖ్యంగా సెక్యులర్ భావాలతో కలిగిన వ్యవస్థ ఉందని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేయూ ఉపకులపతి ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి గొప్ప సెక్యులర్ భావాలు గల వ్యవస్థ ఉందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ తుమ్మల రాజమణి మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం ఎన్నో సవాళ్లను, సమస్యలను చవిచూసిందన్నారు. రాజ్యాంగ రక్షణకు కావలసిన తోడ్పాటు ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కేయూ పూర్వ ఆచార్యులు ద్వారకనాథ్, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు చిర్ర రాజు, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ సురేష్ లాల్, ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ వరలక్ష్మి వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *