– నిరసనకు దిగిన రాహుల్ గాంధీ
న్యూదిల్లీ, ఆగస్ట్ 20: పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. సంసద్ యాత్ర సందర్భంగా పెల్లెట్ గన్ ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్ లోచాబ్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తాను ఎన్నిసార్లు కోరినా పోలీసులు లక్ష్యపెట్టడం లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సాహిల్ లోచాబ్‌ను వెంట తీసుకుని శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తొలుత రాహుల్ గాంధీ కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, న్యూదిల్లీ డీసీపీ సచిన్ శర్మ పార్లమెంటు స్ట్రీట్ పీఎస్‌లో ఉన్నారని తెలియడంతో అక్కడకు వెళ్లారు. పెల్లెట్ గన్‌తో దాడి ఘటనపై దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రావడంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు మాత్రం వారు తిరస్కరించారు. దీంతో, పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సంసద్ చలో యాత్ర సందర్భంగా పార్లమెంటుకు సమీపంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విద్యార్థులపై పెల్లెట్ గన్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, దిల్లీ పోలీసులు మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. సీఆర్‌పీఎఫ్ కూడా ఇప్పటివరకూ స్పందించలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





