– మంత్రులు తుమ్మల, సీతక్క, వాకిటి శ్రీహరి
– రాజేంద్రనగర్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
– నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి
– ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు
– గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు వెబ్సైట్లో ఉంచే ఏర్పాట్లు
రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించిందన్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో ఎల్‌నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని కేవలం విపత్తుగా చూడకుండా ముందస్తు ప్రణాళికతో అవకాశంగా మలుచుకోవాలని మంత్రులు సూచించారు. రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామస్థాయిలో ప్రతీ శాఖ విడివిడిగా కాక వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతీ గ్రామానికి సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపొందించి స్వల్పకాలిక అవసరాలతోపాటు వచ్చే ఐదు, పది సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను ఎంపిక చేయాలని సూచించారు. వీబీ-జీ రామ్‌జీ నిధులను యాదృచ్ఛికంగా కాక ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఉపాధి హామీ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని మంత్రులు సూచించారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతీ పంటకు పంట కుంట, ప్రతీ గ్రామానికి ఊట కుంట వంటి పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటు వ్యవసాయం, చేపల పెంపకం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, గ్రామ సభల నుంచే రూపొందాలని, ప్రతీ పనికి జియో ట్యాగింగ్ చేయాలని, ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎక్కువమందికి ఉపయోగపడే, ఒకే పనితో అనేక ప్రయోజనాలు కలిగే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలి : మంత్రి సీతక్క
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను ఇప్పటినుంచే సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతీ గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని, జీపీఎస్ఏపీ కేవలం ఒక డాక్యుమెంట్ కాదని, అది గ్రామ భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు గ్రామ సభల నుంచే రావాలని, ఐదు, పది సంవత్సరాల దృష్టితో గ్రామాల భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, స్వల్ప, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయంతో ఒకే పనికి అనేక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న క్షేత్రస్థాయి అధికారులు రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరలో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను మంత్రులు, సీఎస్ ప్రారంభించారు. గ్రామంలోని వనరులు, అవసరాలు, చేపట్టాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు ఇందులో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల
గ్రామ స్థాయిలో అనుబంధం ఉన్న అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమని మంత్రి తుమ్మల అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జిల్లాస్థాయిలో కూడా అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని, తమ కోసం అధికారులు కష్టపడి పనిచేస్తున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని అన్నారు. ప్రజల మేలు కోసం పనిచేసే అధికారులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఉపాధి హామీ నిధులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాలని, నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినోను ఆపడం మన చేతుల్లో లేకపోయినా దాని ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 30 లక్షల బోర్లపై సాగు ఆధారపడి ఉందని, అందువల్ల భూగర్భ జలాలను పెంచే పనులను ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని, గత రెండేళ్లలో లక్ష ఎకరాల్లో పామాయిల్ సాగును పెంచామని, యేటా రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచడమే లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
పంటల మార్పిడితో మార్పులు తేవచ్చు : మంత్రి వాకిటి
దేశం గతంలో కూడా ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొందని, 1951 నుంచి ఇప్పటివరకు భారత్ 12 సార్లు ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కరవును ఎలా ఎదుర్కోవాలో రైతులకు అవగాహన ఉన్నప్పటికీ ఆ అవగాహనను ఆచరణలో పెట్టించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తేవచ్చని, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందస్తు కార్యాచరణతో ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, తెలంగాణ కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. కరవు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చేపల పెంపకానికి అవసరమైన నీటిని అందుబాటులో ఉంచేందుకు చెరువులు, చెక్‌డ్యామ్‌ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలని సూచించారు. మేకలు, గొర్రెల మేత కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి కేటాయించడం ద్వారా పశు సంపదను పెంచుకోవచ్చన్నారు. ఎలాంటి కరవు పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగే రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని, భరోసా కల్పించాలని అన్నారు. ముందస్తు ప్రణాళికతో రాష్ట్రాన్ని దేశానికే ఒక మోడల్‌గా నిలపవచ్చని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : సీఎస్ సంజయ్ జాజు
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో విస్తృతంగా వరి సాగు ప్రారంభమైందని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. ఇంకా సుమారు 20 లక్షల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందని, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెరి-అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం, పూల సాగును ప్రోత్సహించాలని, వాటికి అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వీబీ-జీ రామ్‌జీ ద్వారా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థాయిలో పక్కా ప్రణాళిక ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వర్క్‌షాప్‌నకు హాజరైన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వాలి : ఎంపీ నరేందర్‌రెడ్డి
ప్రజలకు అవసరమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. కేవలం టార్గెట్లు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అవసరం లేని పనులు చేపట్టవద్దని సూచించారు. వీబీ-జీ రామ్‌జీ కింద రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే పరిమితం కాక ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే పనులు చేపట్టాలన్నారు. రైతులు వేసిన పంటలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సూచించారు. గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో పలువురు సర్పంచులు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సహకారం గురించి వివరించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర వివరాలు అందుబాటులో ఉండేలా ప్రతీ గ్రామానికి ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను రూపొందించి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలో అగ్రగామిగా, స్వయం సమృద్ధిగా, ఉండేలా అనుబంధ శాఖలతో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు.
వర్క్‌షాప్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, టీజీఐఆర్డీ సీఈవో నిఖిల, హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కొర్ర లక్ష్మి, ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





