రేషన్ షాపుల ద్వారా జొన్న, మొక్కజొన్న

– వేలం వేయకుండా ప్రజలకు అందించాలని ఆలోచన
– పేదలకు పౌష్టికాహారం.. మధ్యవర్తుల దందాకు చెక్
– రైతు పక్షపాతిగా వారికి ప్రభుత్వం అండ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాక సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేద ప్రజలకు చేర్చేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు ఈ పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మధ్యవర్తుల దోపిడీకి చెక్ – పేదలకు మేలు

సాధారణంగా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకుని మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడుతుంటారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి నేరుగా ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కేవలం మార్కెట్ సరకుగా మిగిలిపోకూడదు.. అది పేదవాడి ఆకలి తీర్చి పౌష్టికాహారంగా మారాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గురుకులాలు, హాస్టళ్లకు పౌష్టికాహారం

ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే వేలాదిమంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా మొక్కజొన్న, జొన్నల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ట్రీ రైతులకు అవసరమైన మేరకు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రైతులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *