వయోపరిమితి పదేళ్లు పెంచాలి

– డిప్యూటీ సీఎంకు కోదండరాం, అద్దంకి విన్నపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో పదేళ్లపాటు సడలించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను వేర్వురుగా కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పదేళ్లపాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం కూడా పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాదిమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి అని, ఈ నేపథ్యంలో అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలంటే భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లలో వయోపరిమితిని పెంచాలని కోరారు. తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని వారు వివరించారు. ఈ విన్నపంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగులకు సంబంధించిన ఈ సమస్య గురించి వారితో లోతుగా చర్చించారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితి సడలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *